తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాక తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ప్రజలు చేసుకున్న అదృష్టంగా సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్ బాబు అన్నారు. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆసక్తికరంగా మాట్లాడారు. తెలంగాణ నాయకులకు ఎటువంటి అవినీతి మచ్చ అంటకుండా ఎన్టీఆర్ తరహాలో కేసీఆర్ వంటి నాయకుడు పాలన చేయడం ప్రజలు చేసుకున్న అదృష్టంగా అభివర్ణించారు. దివంగత ఎన్టీఆర్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టమని, అందుకనే కుమారుడికి తారకరామారావు అని పేరు పెట్టుకున్నాడని ఆయన వెల్లడించారు.
కాగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామికి కేసీఆర్ రూ. 400 కోట్లు కేటాయించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తాను 13 యేళ్ళ తర్వాత ఈ దేవాలయానికి వస్తున్నానని అప్పట్లో వచ్చినప్పుడు మా కుమార్తె లక్ష్మీప్రసన్నకు వివాహం కావాలని దేవుణ్ణి మొక్కుకున్నానని, ఇప్పుడు కూతురుతో పాటు కుమారులకూ పెళ్ళిలయినవి అనీ ఆయన వెల్లడించారు. రాజన్న కరుణతో మా కుటుంబమంతా సంతోషంగా ఉన్నామని వివరించారు. మొత్తానికి మోహన్ బాబు తమ మాటకారి తనంతో కేసీఆర్ ని పొగిడేసి బుట్టలో వేసేసుకున్నాడు మరి.