తమిళ నటుడు విశాల్ ఈ మధ్య నిర్మాతల మండలిపై తీవ్రంగా విరుచుకు పడ్డాడు. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసమని నిర్మాతల మండలి దగ్గరకు వెళ్తుంటే వాళ్ళు ఆ విషయాన్ని పక్కదారి పట్టించేలా బిస్కెట్ వేసి పంపుతున్నారని, టైమ్ పాస్ చేస్తున్నారని అసంతృప్తిని కక్కేశాడు. అంతే కాకుండా నిర్మాతల మండలి చక్కగా పని చేయాలంటే ఇప్పుడున్నవారంతా మారి కొత్త రక్తం వస్తే కానీ బాగుపడదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. అసలు మండలి పైరసీ విషయం చాలా తేలికగా కొట్టిపారేస్తుందని వివరించారు. పైరసీ ద్వారా నిర్మాతలే కాకుండా నటులు సాంకేతిక నిపుణులకు అందరికీ దెబ్బపడుతుందని ఘాటుగానే స్పందించాడు.
ఇదంతా ఓకేగానీ, అసలు నిర్మాతల మండలికి ఎక్కడ కాలిందంటే డి.టి.హెచ్. రైట్స్ విషయంలో నిర్మాతలు స్పందించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సినిమాకు కొంత అదనంగా ఆదాయం వస్తుందన్నాడు. ఇంకా సినిమా విడుదలైన 15 రోజుల తరువాతే డీవీడీలు మార్కెట్లోకి వచ్చేలా ఒప్పందాలు చేసుకోవాలని కూడా ఉచిత సలహాలు ఇవ్వడంతో వారికి మండింది. దీంతో నిర్మాతల మండలి ఆగ్రహానికి గురైంది. ఇటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం అని, విశాల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాడా... సరే... అలా జరగని పక్షంలో రాబోయే అతడి సినిమాల విడుదల విషయంలో పంపిణీదారులు ముందుకురారని కూడా హెచ్చరించారు. ఈ విషయంలో ఎక్కవ రాద్ధాంతం చేస్తున్నదంతా నిర్మాతల మండలి అధ్యక్షుడు కబాలీ నిర్మాత కలైపులి థాను అని తెలుస్తుంది. ఈ మధ్య విశాల్ కు, కబాలి నిర్మాతకు మధ్య కాస్త అభిప్రాయ బేధాలు వచ్చాయన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే అతనలా చేస్తున్నాడని కూడా తెలుస్తుంది. కాగా ఈ విషయంపై విశాల్ స్పందిస్తూ దీనిపై ఇంకా తనకెలాంటి సమాచారం లేదని, వచ్చినప్పుడు స్పందిస్తానని వెల్లడించాడు.