సమాజంలో ఎక్కడైతే చైతన్యం ఉంటుందో అక్కడే వివాదం కూడా ఉంటుంది. స్మృతి ఏ శాఖ చేపట్టినా అందులో సంచలనాలు ఉండాల్సిందే. నిన్నటికి మొన్న మానవ వనరుల శాఖలో కూడా నిత్యం వివాదాలతోనే గడిపింది. కొత్తగా చేనేత శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్మృతి ఇరాని రెండు నెలలు కూడా గడవక ముందే చేనేత శాఖలో సీనియర్ అధికారి అయిన రష్మి వర్మతో గొడవలు మొదలెట్టింది. జూన్ 22న కేబినెట్ ఆమోదించిన 6వేల కోట్ల రూపాయల దుస్తులు, వస్త్రాలు ప్యాకేజీ, అక్టోబర్ లో జరుగబోయే టెక్స్‑టైల్ సదస్సు కు సంబంధించిన వ్యవహారాల్లో ఆ అధికారితో విభేదాలు పొడసూపినట్లుగా తెలుస్తుంది. ఆ విషయానికి సంబంధించి స్మృతి ఇరానీ కోపంతో తక్కిన అధికారుల ముందే ఆ కార్యదర్శిపై తీవ్రంగా మండిపడినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఈ మధ్య జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా వస్త్రాలు, దుస్తులు ప్యాకేజీ అవకతవకలపై ఇరానీ మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆమె వర్మతోనూ, తక్కిన అధికారులతో పీఎంఓ సమావేశం ఏర్పాటు చేసి మందలించిందని కూడా సమాచారం.
ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి పలుమార్లు స్మృతి ఇరాని.. వర్మకి నోటీసులను కూడా పంపినట్లు తెలుస్తుంది. కాగా స్మృతి ఇరానీతో తమకు ఎలాంటి వివాదాలు లేవని వర్మ ఖండించాడు. అయితే రాబోవు మూడేళ్లలో ఈ శాఖకు సంబంధించి కోటి కొత్త ఉద్యోగవకాశాల కల్పనకు సంబంధించి మెగా ప్రాజెక్టు గురించి వివరించి, ఆ దిశగా స్మృతి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.