వైకాపా అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం అధికార పార్టీపై వాక్బాణాలను సంధిస్తూనే ఉన్నాడు. ఏ మాత్రం తగ్గకుండా ఎక్కడ ఏ సమావేశంలో ప్రసంగించినా తూటాల వంటి మాటలతో ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. ఏపీలో దేవుళ్ళకే భద్రత లేదని, ఇక ఆ దేవుళ్ళను నమ్ముకొన్న ప్రజలకు భద్రత ఎక్కడ ఉంటుందని తన దైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. అలాగే ప్రజలు ఆదర్శంగా తీసుకొన్న మహాత్మా గాంధీ, రాజశేఖర్ రెడ్డి వంటి వారి విగ్రహాలకు కూడా బుల్డోజర్లతో వారి నామరూపాలు లేకుండా చేయడానికి చంద్ర బాబు ప్రయత్నిస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశాడు. అసలు గుడిని ముట్టుకోవాలన్నా, గుడి శిలలువంటి వాటి జోలికి వెళ్ళాలన్నా కొన్ని పవిత్రమైన కార్యక్రమాలు చేయాలి, ఆ తర్వాత వాటిని మరో చోట ప్రతిష్ఠించడం జరగాలి. అలాంటిది వాటిని పూర్తిగా పక్కనబెట్టి... పుష్కరాలను పూర్తిగా రాజకీయాలకు వాడుకుంటున్న ఘనత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే చెల్లుతుందని ఆయన మండిపడ్డాడు.
అసలు చంద్రబాబు నాయుడికి గుడులు, గోపురాలు, దేవుళ్ళ వంటి వాటిపై విశ్వాసం లేదని అందుకే ఇలాంటి ఘోరకార్యాలకు పాల్పడుతున్నాడని వెల్లడించాడు. అంతే కాకుండా దేవుడి మాన్యాల జోలికి పోయి వాటిని కోట్ల రూపాయలకు దారాదత్తం చేస్తున్నాడని వివరించాడు. గుడిని, గుడిలో లింగాన్ని కాజేసే సంస్కృతికి త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వస్తుందని ఆయన తెలిపారు. ఇంకా సదావర్తి మాన్యాలు సాక్షాత్తు శివుడివి. అలాంటి ఆ భూములను రూ. వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేసేవి కేవలం రూ. 22 కోట్లకే తమ బినామీలకు బాబు దోచి పెట్టాడని వెల్లడించాడు. ఇలాంటి చంద్రబాబును కృష్ణ పుష్కరాల సందర్భంగా ఆ దేవుడే కాపాడాలని తన దైన శైలిలో జగన్ విరుచుకు పడ్డాడు.