హీరో విశాల్‌కు, శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మీల మధ్య ప్రేమాయణం సాగుతోందనే విషయం అందరికీ తెలిసిందే. చాలా సార్లు త్వరలో విశాల్.. వరలక్ష్మీలకు వివాహం జరుగనుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. అసలు విశాల్‌కు, శరత్‌కుమార్‌ల మధ్య వివాదానికి ఇదే ప్రధానమైన కారణమనే వారు కూడా ఉన్నారు. అయితే ఇటీవల వరలక్ష్మీ ట్విట్టర్ సాక్షిగా తన వివాహం విషయంలో వస్తున్న వార్తలపై మండిపడింది. మీ గోల ఆపండి.. నేను ఇప్పట్లో ఎవ్వరినీ వివాహం చేసుకోబోవడం లేదు.ఆ హంగామాను పక్కన పెట్టండి. ప్రస్తుతం నేను నా పనినే ప్రేమిస్తున్నానంటూ ట్వీట్ చేసి, విశాల్‌తో తన పెళ్లి విషయంలో వస్తున్న వార్తలకు చెక్‌పెట్టింది. ఉన్నట్లుండి ఇలా వరలక్ష్మీ ఎందుకు అడ్డం తిరిగిందో తెలియక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయమై ఇప్పటివరకు విశాల్ కూడా నోరు విప్పి స్పందించలేదు. విశాల్ స్వయంగా స్పందిస్తే గానీ ఈ ప్రేమాయణాన్ని వరం అలియాస్ వరలక్ష్మీ ఎందుకు ఇలా కోపంతో ట్వీట్ చేసిందో క్లారిటీ రాదని కోలీవుడ్ మీడియా అంటోంది. మొత్తానికి అదిగో పెళ్లి, ఇదుగో పెళ్లి అంటూ దాదాపు 40ఏళ్ల వయసుకు చేరువైన విశాల్ ప్రేమాయణానికి శుభం కార్డు పడుతుందో లేక విషాదాంతపు ముగింపు ఉంటుందోనని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.