శ్రుతిహాసన్ నటిగానే కాకుండా గానంలో కూడా మంచి పట్టుంది. ఇప్పటి వరకు శ్రుతి తన సినిమాల కోసం అప్పుడప్పుడు తనే పాటలు పాడుకుంటుంది. కానీ ఇప్పుడు మరో మెట్టు ఎక్కి తమన్నా కోసం ఓ గీతం ఆలపించడానికి తన స్వరాన్ని మెరుగుపరుచుకుంటుందట. విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఒక్కడొచ్చాడు. హరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ తమన్నా. ఈ సినిమాలోకి ఓ పాటని శ్రుతిహాసన్‌తో పాడించాలని చిత్రం యూనిట్ నిర్ణయించుకున్నారట. కానీ ఇన్నాళ్ళు అడపా దడపా తన సినిమాలకే తనకోసం పాడిన శ్రుతి మరో హీరోయిన్ కు గాత్రం అందించడం ఇదే మొదటి సారి. అయితే త్వరలోనే ఈ పాటని రికార్డ్ చేయబోతురన్నారని వినికిడి. కాగా ఈ చిత్రానికి గాను హిప్ ఆప్ తమిళ్ ఇచ్చిన ట్యూన్‌కి డా.భాగ్యలక్ష్మి సాహిత్యం అందించింది.
ఒక్కడొచ్చాడు చిత్రం ఆడియోని అక్టోబరు 9న విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ... ఈ చిత్రం విశాల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమవుతుందని వెల్లడించాడు. పక్కా యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్.. అన్నీ ఈచిత్రంలో అచ్చు కుదిరాయని, సెప్టెంబర్ 3 నుండి రష్యాలోని అందమైన స్పాట్స్ లో పాటలు చిత్రీకరిస్తామని వివరించాడు. కాగా అటు తమిళంలోనూ, తెలుగులోనూ వరుస ఫ్లాపులతో ఉన్న విశాల్ కు ఈ చిత్రం విజయాన్ని ఇవ్వనుందేమో చూడాలి. తెలుగులో పందెం కోడి తర్వాత ఆ స్థాయి హిట్టు విశాల్ కు రాలేదనే చెప్పాలి. ఈ సారైనా ఆ స్థాయి హిట్ రావాలని కోరుకుందాం..