మాజీ ఎంపీ, సీనియర్ సినీ నటి జయప్రదకు క్యాబినెట్ హోదా చేజిక్కింది. చాలా కాలం నుండి ఖాళీగా ఉన్న జయప్రద ఎట్టకేలకు కేబినెట్ ర్యాంకు పదవి దక్కించుకుంది. జయప్రద ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నుంచి రెండుసార్లు సమాజ్ వాదీ పార్టీ తరపున లోక్ సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. జయప్రదకు అతి సన్నిహితుడుగా పేరొందిన సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ కొంత కాలం నుండి జయప్రద విషయంలో పార్టీపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాజ్ వాదీ పార్టీలో తనతో పాటు తనకు అతి సన్నిహితురాలైన జయప్రద ఇద్దరం ఏ పదవీ చేపట్టకుండా పెద్ద అవమానాన్ని మోస్తున్నామని, ఇంటువంటి అవమానాలు భరించేబదులు పార్టీ నుంచి వైదొలుగడం మంచిదని అమర్ సింగ్ వెల్లడిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతలా అమర్ సింగ్ వత్తిడి తీసుకురావడంతో యూపీ సీయం అఖిలేష్ యాదవ్, జయప్రదను యూపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ డిప్యూటీ చైర్ పర్సన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. కాగా ఈ విషయంపై యూపీలో పెద్ద దుమారం నడుస్తోంది. అమర్ సింగ్ బెదిరించడంతోనే అఖిలేష్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని యూపీ అంతా హాట్ టాపిక్.
కాగా యూపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ చైర్మన్ గా ప్రస్తుతం కవి గోపాల్ దాస్ నీరజ్ ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ చైర్ పర్సన్ గా జయప్రద కొనసాగబోతుంది. అయితే 2010లో జయప్రద, అమర్ సింగ్ తో పాటు సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కరణ వేటుకు గురైన విషయం తెలిసిందే. మొన్న రిగిన సాధారణ ఎన్నికల్లో ఏపీ నుండి పోటీ చేసేందుకు జయప్రద చాలా ప్రయత్నించింది. చివరకు సొంతగూటికే చేరుకుంది. ఈ సమయంలో అఖిలేష్ యాదవ్, జయప్రదకు కేబినెట్ ర్యాంకుతో కూడిన పదవి ఇవ్వడం ఎంతైనా సంతోషించాల్సిన విషయం.