ఉత్తరాఖండ్ భాజపా ఎమ్మెల్యే గణేశ్ జోషి తనను బెదిరించారని సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆరోపించాడు. రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ జోషి తనపై నోరు పారేసుకున్నాడని వెల్లడించాడు. ఓ భాజపా ఎంపీని ఆహ్వానించేందుకు తన అనుచరులతో కలిసి డెహ్రాడూన్ విమానాశ్రయానికి వచ్చిన జోషి.. తన మీదకు దూసుకొచ్చి మరీ బెదిరింపులకు పాల్పడ్డాడని వాద్రా వెల్లడించాడు.
కాగా వీరిద్దరి మధ్య గతంలో ఏ వివాదం చోటు చేసుకుందో తెలియడం లేదు. అయితే ఆయన భాజపా, ఈయన కాంగ్రెస్ పార్టీనే కారణమా లేకా వీరిద్దరి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయా అన్నదానిపై స్పష్టత రాలేదు. కానీ రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. పోలీసు గుర్రం ‘శక్తిమాన్’ చావుకు కారణమైన వాడు గణేష్ జోషి. దాంతో ‘మీరు దౌర్జన్యం చేస్తున్నా మాట్లాడకపోవడానికి నేను గుర్రాన్ని కాదు. మూగజీవమైన గుర్రం మాట్లాడలేదు. నేను అలా కాదు నేను మాట్లాడగలను పోరాడగలను’ అని జోషికి సమాధానం ఇచ్చినట్టు రాబర్ట్ వాద్రా తెలిపారు. ఆ ఘటన వెంటనే జోషిని ఆయన అనుచరులు విమానాశ్రయం బయటకు తీసుకెళ్లారని వాద్రా చెప్పాడు. కాగా మార్చి మాసంలో డెహ్రాడూన్ లో జరిగిన భాజపా ఆందోళన సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ జోషి గుర్రాన్ని లాఠీతో కొట్టడంతో ‘శక్తిమాన్’ మరణించిన విషయం అందరికీ తెలిసిందే.