ఏ వ్యక్తికైనా దేశాభిమానం అనేదే ఉండాలనీ ఎలాంటి వెర్రి వ్యామోహాలు వ్యక్తులపై ప్రదర్శించకూడదని, అలాంటివి ముఖ్యంగా అభిమానులు చూపకూడదని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీయార్ వెల్లడించాడు. కాగా ఈ మధ్య ఇద్దరి హీరోల మధ్య ప్రేమ పెంచుకున్న ఇద్దరి అభిమానుల మధ్య జరిగిన అధిక వ్యామోహంతో కూడిన గొడవ కారణంగా వినోద్ రాయల్ అనే పవన్ కళ్యాణ్ అభిమాని హత్యకు గురైన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ విషయంపై ఎన్టీఆర్ ఓ టీవీ ఛానల్ లోని ఇంటర్వ్యూ సందర్భంలో అభిమానుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
అభిమానులెప్పుడూ హద్దులు దాటరని, అలా నా అభిమానులు ఉంటారని, ఉండాలని తాను భావించడం లేదని వెల్లడించాడు. ‘సొంత లాభం కొంత మాని పొరుగు వారికి తోడు పడవోయ్’ అన్న గురజాడ మాటల్లా అభిమానం అనేది పొరుగువారికి మేలు చేసే సందర్భంలో చూపాలి కానీ ఇలాంటి వ్యక్తిగతమైన దూషణలతో దాని అర్థాన్ని చెరిపివేయడం మానుకోవాలని స్పష్టం చేశాడు. ఇంకా తాను అభిమానులందరికీ ఒక్క విషయం స్పష్టం చేశాడు. ఎవరి పట్ల మితిమీరిన వ్యామోహమో, అభిమానం అవసరం లేదు. అభిమానం అనేది దేశం మీద చూపించండి.. ఆ తర్వాత కన్న తల్లిదండ్రులు మీద ఆచరణాత్మకంగా చేసి చూపించండి.. ఆ తర్వాత భార్య, పిల్లలపై, ఇంకా మిమ్మల్ని ప్రేమించే శ్రేయోభిలాషులపై ప్రదర్శించండి. ఆ తర్వాతనే అభిమాన నటుడిని ప్రేమించండి. ఇది తాను అందరి హీరోల అభిమానులకు చెప్తున్నట్లుగా వెల్లడించాడు జూనియర్ ఎన్టీయార్.
ఇంకా ఎన్టీయార్ మాట్లాడుతూ.. ‘మేం హీరోలమంతా చాలా సఖ్యంగా ఉంటాం, మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు. అలాంటిది అభిమానుల మధ్య ఎందుకీ పోటీతత్త్వ' అంటూ ఆయన అభిమానులకు చురకలు అంటించారు. అభిమానం అనేది సినిమా వరకే ఉంచుకోవాలి. అలాంటి రెండు గంటల సినిమా కోసం ప్రాణాలు తీసుకునేలా అభిమానులు వ్యవహరించడం చాలా దురదృష్టకరమంటూ స్పష్టం చేశాడు. ఇంకా 'అలాంటి అభిమానులెవరైనా ఉంటే వారు నా అభిమానులుగా ఉండనవసరం లేదు' అంటూ తన అభిమానులను హెచ్చరించాడు జూనియర్ ఎన్టీయార్.