సినిమాల్లో, రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం, శాశ్వత శత్రుత్వం ఉండదంటారు. దీనికి తాజా ఉదాహరణ దాసరి, చిరు కలయిక. అయితే వీరిద్దరిని కలిపింది సినిమా కాదు, రాజకీయం కాదు. కులం. ఇద్దరు 'కాపు' కులస్తులు కావడంతో దశాబ్దాలుగా ఉన్న దూరాన్ని వదిలేసి దగ్గరయ్యారు. కులానికి ఎలాంటి పవర్ ఉంటుందో వీరి కలయిక చూస్తుంటే అర్థం అవుతుంది. మంగళవారం నాడు దాసరి ఇంట్లో జరిగిన కుల మీటింగ్‌కు చిరంజీవి ప్రత్యేక ఆహ్వానితునిగా వెళ్ళారు. చాలా చాలా సంవత్సరాల తర్వాత దాసరి ఇంటికి వెళ్ళాల్సి రావడంతో చిరు కొంత ఇబ్బంది పడ్డారు. కానీ కులం కోసం తప్పని పరిస్థితుల్లో వెళ్ళారు.
ఉప్పు, నిప్పుగా ఉండే దాసరి, చిరు మిగతా కాపు నాయకులతో కలిసి సమావేశం అయ్యారు. భవిష్యత్తు కార్యచరణ గురించి చర్చించుకున్నారు. చంద్రబాబు మెడలు వంచి రిజర్వేషన్లు సాధించాలని వీరంతా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలే ఈ సమావేశంలో కనిపించడం విశేషం.
మొన్న తిరుపతి సభలో 'తనకు కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఆపాధించవద్దని' పవన్ కల్యాణ్ స్పష్టంగా చెబితే ఆయన సోదరుడు చిరంజీవి మాత్రం కుల సమావేశంలో పాల్గొనడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది.
సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి, మళ్లీ వాటిని వదిలేసి సినిమాల్లోకి వచ్చిన మెగాస్టార్ మళ్లీ పూర్వవైభవం కోసం సినిమా చేస్తున్నారు. సినిమా అంటే అన్ని వర్గాలకు నచ్చాలి. మరి చిరంజీవి కేవలం ఒక కులానికి కొమ్ముకాస్తుండడం వల్ల దీని ప్రభావం ఆయన నటిస్తున్న సినిమాపై ఏ మేరకు ఉంటుందో చూడాలి.