రచయిత అనే వాడికి రచనపైన, దార్శనికుడు తన దర్శకత్వ ప్రతిభపైనే ఎప్పుడూ దృష్టి సారిస్తుంటాడు. సమాజంలో ఏ మూలన ఎటువంటి ఘటన జరిగినా దాన్ని తమ నేటివిటీకి అనుగునంగా మలుచుకొని, అలా అల్లుకొని కథలను రూపొందించడం కథకుడి లక్షణం. నిత్యం సమాజంలో ఎన్నో సంచలనాత్మక ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి వాటిపై చాలా ప్రత్యేక దృష్టి పెడుతుంటాడు సంచలనాత్మక దర్శకుడు రాం గోపాల్ వర్మ. ముఖ్యంగా నేరచరిత్ర ఉన్నవారిపై, మావోయిస్టులపై, కిల్లర్స్ పై, నరహంతకులపై సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు వర్మ. ఈ మధ్య పలురకాల నేరాలకు, ఘోరాలకు పాల్పడి ఎన్ కౌంటర్ ద్వారా మరణించిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవిత చరిత్ర ఆధారంగా వెండితెరపై మరో రియల్ క్రైం స్టోరీని ఆవిష్కరిస్తానని దర్శకుడు వర్మ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అనంతపురం ఫ్యాక్షన్ ముఠాకక్షల నేపథ్యంలో ’రక్తచరిత్ర’, ’రక్తచరిత్ర-2’ సినిమాలను వర్మ తెరకెక్కించాడు. అదేవిధంగా, ముంబై మాఫియా నేపథ్యంతో ’సత్య’ వంటి సంచలనాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందించిన విషయం తెలిసిందే.
కాగా ప్రస్తుతం హైదరాబాద్ లోనే కాకుండా దేశం మొత్తంలోనూ, ఇంకా పలు దేశాల్లో కూడా అక్రమంగా, దౌర్జన్యంతో, మర్డర్ లతో, మానబంగాలతో, ప్రముఖ రాజకీయ, అధికారుల ప్రోత్సాహంతో, వారి అండదండలతో ఎదురులేకుండా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న అతి కిరాతకుడైన డాన్ నయీమ్ కథతో సినిమా తీస్తానని ప్రకటించాడు వర్మ. ప్రకటనతోనే సరిపెట్టుకోకుండా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాడు. తాజాగా తన ట్విట్టర్ ద్వారా వర్మ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పోస్ట్ చేశాడు. ’నయీమ్’ టైటిల్‌తో ఆ పైన రాంగోపాల్ వర్మ అనే పేరుతో రూపొందిన పోస్టర్ ఇది. ఈ పోస్టర్లో నయీంలోని కిరాతక లక్షణాలైన క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్, గూండా, గ్యాంగ్‌స్టర్ వంటి పదాలను ఉపయోగించి ఈ టైటిల్‌ను చాలా సృజనాత్మకంగా రూపొందించాడు. కాగా ట్విస్ట్ ఏంటంటే ఈ పోస్టర్ ను ఎవరు చేశారో తెలియడం లేదు కానీ, తనకు బాగా నచ్చడంతో దాన్ని ట్వీట్ చేశానని వర్మ చెప్పకొచ్చాడు.... వర్మ ఎప్పుడు నయీమ్ పై దృష్టి మరల్చుతాడో చూద్దాం.