సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి'. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మధ్యప్రదేశ్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు క్రిష్ రాజకోటలకు చెందిన సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యుద్ధ సన్నివేశాలు ముగించగా... తాజాగా మధ్యప్రదేశ్ లోని రాజకోటల సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు క్రిష్. ఈ సినిమాలో బాలకృష్ణ తల్లి పాత్రలో హేమమాలిని, భార్య పాత్రకు శ్రియను తీసుకొని వారిపై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.
కాగా హేమమాలిని మొదటిరోజు షూటింగ్ కు రాగానే బాలకృష్ణ తను ప్రత్యేకంగా హిందూపురం నియోజక వర్గం నుండి తెప్పించిన లేపాక్షి చీరను బహూకరించాడు. దీంతో హేమమాలిని అపరిమితమైన ఆనందానికి లోనైంది. ఆ సందర్భంగా గతంలో సీనియర్ ఎన్టీయార్ తో తాను నటించిన విషయాలను జ్ఞాపకం చేసుకుంది. బాలీవుడ్ సీనియర్ నటి అయిన హేమమాలిని సీనియర్ ఎన్టీయార్ తో పాండవ వసవాసం, శ్రీకృష్ణ విజయంలో నటించిన విషయం తెలిసిందే. కాగా బాలకృష్ణ కథా నాయకుడుగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాను 2017 సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.