వాదాన్ని, వివాదాన్ని ఓ వ్యసనంగా భావించే గొప్ప దర్శకుడు రాంగోపాల్ వర్మ. శ్రీ సర్వేపల్లి రాధా కృష్ణన్ జన్మదినాన్ని దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అదే గురుపూజోత్సవం నాడు దర్శకుడు వర్మ నెగెటివ్ వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లలో నానా రాద్ధాంతం చేశాడు. ఒక రకంగా గురువులను కించ పరిచేలా ఘాటు విమర్శలు చేశాడు. వర్మ పలు ట్వీట్లతో ఏం రాశాడంటే... పిల్లలు స్కూళ్ళకి వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకోవద్దని, విద్యార్థులు గూగుల్ ద్వారానే నేర్చుకోవాలని సూచించాడు. ముఖ్యంగా తానూ టీచర్ లందరిని ద్వేషించేవాడినన్నాడు. అలా అప్పట్లో ఒకరకంగా స్కూల్ ఎగ్గొట్టి సినిమాలు చూడడం మూలంగానే ఇంత పెద్ద దర్శకుడిని కాగలిగానని తన గొప్పలు చెప్పుకొచ్చాడు. స్కూళ్ళో తానెప్పుడూ నేర్చుకున్నది లేదంట, అందరికీ ఎప్పుడూ నేర్పుతూ ఉండేవాడినన్నాడు. అందుకనే హాపీ టీచర్స్ డేను తన్ను తాను చెప్పుకుంటుంటాడట.
ఒకరకంగా చూసుకుంటే ‘నా చిన్నప్పుడు పాఠాలు చెప్పిన టీచర్స్ అందరికంటే నేను మేధావినని, వారందరికంటే నేనే ఎక్కువ విజయాలు సాధించాను’ అని అన్నాడు. అస్సలు స్కూల్లో గొడవలను తీర్చుకోవడం, పోరాటాలు చేయడం ద్వారానే తాను ఎదిగానని, అటువంటి వాటి ప్రభావం తనపై అధికంగా ఉందని, అందుకే తాను శివ, సత్య వంటి సినిమాల్లో వాటిని ఉపయోగించానని ఆయన వెల్లడించాడు. వర్మకు టీచర్లపై అంత ద్వేషం కలగటానికి కారణం కూడా చెప్పాడు. ఇంకా టీచర్స్ క్లాస్ లో చెప్పినవి, చదివించినవి మర్చిపోడానికి, ఆతర్వాత కామిక్ పుస్తకాలు, ఫిక్షన్ నవలలు లాంటివి చదవాల్సి వచ్చేదని వివరించాడు. సాధారణంగా తాను విస్కీ తాగడట, కానీ టీచర్స్ విస్కీ మాత్రం అమిత ఇష్టంగా తాగేవాడంట. కాగా వర్మ టీచర్స్ పై కామెంట్లకు నెటిజన్లు ఆ దర్శకుడి పై వీరలెవల్లో మండి పడుతున్నారు.