పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు అయిన రేణు దేశాయ్ ఉన్నఫలంగా తన అభిమానులపై సీరియస్ అయ్యింది. తన వ్యక్తిగత జీవితంపై వెకిలిగా మాట్లాడుతున్నవారిపై రేణు ఘాటుగా స్పందించింది. మొదట శ్రేయోభిలాషులు, అభిమానులు తన పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెల్పిన రేణు దాంతోపాటు ఓ లేఖను పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఒక వీడియోను కూడా షేర్ చేసింది రేణు. ఇది చూసిన తర్వాత అయినా వాళ్ల ధోరణిలో మార్పు రావాలంటూ ఆమె ప్రత్యేకంగా కోరింది. ఇంకా రేణు దేశాయ్ మరో విచిత్రాన్ని చవి చూపించింది. తన లేఖావళి ద్వారా తెలిపిన రేణు తెలుగును ఇంగ్లీషులో రాసి అభిమానులను ముచ్చటగొలిపింది. ఇంకా తాను రాస్తూ ఏమైనా వ్యాకరణ దోషాలుంటే క్షమించాలని కోరింది. స్వచ్ఛమైన తెలుగు మాటలను ఆంగ్లంలో టైప్ చేసిన రేణు అందులో ఏ రకమైన తప్పులు దొర్లకపోవడం విశేషమే.
ఇంకా రేణు స్పందిస్తూ ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న సమయంలో తాను ఎందుకు మాట్లాడకూడదంటూ రేణు ప్రశ్నించింది. కాగా 17 ఏళ్లుగా తామిద్దరం మంచి స్నేహితులమని, పదకొండేళ్ల పాటు పవన్ కు తాను భార్యగా ఉన్నానని, తన బిడ్డలకు ఆయన తండ్రి అని రేణు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నది. గత ఆరు సంవత్సరాలుగా తమ పిల్లల కోసం పవన్ తాను అప్పుడప్పుడూ అలా కలుసుకుంటామని రేణు తెలిపింది. అటువంటిది తాము పవన్ గురించి మాట్లాడకూడదని కొంతమంది తనను ఎందుకు ప్రశ్నిస్తున్నారో అర్థం కావడం లేదంటూ రేణూ దేశాయ్ వాపోతుంది. వాపోవడం కాదుగానీ, ప్రశ్నలు సంధిస్తుంది. మొత్తానికి ఆ కాలంలో.. పవన్, భార్యకు కూడా ప్రశ్నించడాన్ని బాగా నేర్పించినట్లుగా అర్థమౌతుంది.