అక్కినేని నాగేశ్వర రావు బర్త్ డే కానుకగా నాగేశ్వరరావు మనవడు నాగ చైతన్య నటించిన 'ప్రేమమ్' సినిమా ఆడియోని హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ ఆడియో కి నాగార్జున తన ఇద్దరి కొడుకులు... అఖిల్, నాగచైతన్యతో హాజరయ్యాడు. ఇక 'ప్రేమమ్' లో నాగ చైతన్యకి జంటగా నటించిన శృతి హాసన్ కూడా హాజరయ్యింది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దాసరి నారాయణ రావు విచ్చేసారు. ఈ 'ప్రేమమ్' ఆడియో ఫంక్షన్ లో దాసరి.. నాగ చైతన్య గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
చైతన్య నవ్వులో ఏదో మాయ ఉంది. ఆ నవ్వుతోనే పడేశాడు ఓ హీరోయిన్ ని. ఏ మాయ చేసిందో ఆ హీరోయిన్.... అంటూ అసలు విషయం చెప్పకనే చెప్పేసాడు. నాగ చైతన్య - సమంత పెళ్లి గురించి అక్కడక్కడా వార్తలైతే వస్తున్నాయి గాని ఎక్కడా ఆఫీషియల్ గా చెప్పలేదు. మరి దాసరి ఇలా ఈ ఆడియో లో మీడియా కి ఒక క్లారిటీ మాత్రం ఇచ్చేశాడు. అయితే ఈ కామెంట్స్ చేస్తున్నప్పుడు నాగ చైతన్య ముసి ముసి నవ్వులు నవ్వుతూ తెగ సిగ్గుపడిపోయాడనుకోండి.
ఇంకా దాసరి మాట్లాడుతూ నాకు ఇష్టమైన వారి ఫంక్షన్స్ కి మాత్రమే నేను హాజవుతానని... నాగార్జున నాకు బాగా కావాల్సిన వాడని అందుకే ఈ ఆడియో కి వచ్చానని చెప్పారు. ఇంకా నేను నాగేశ్వర రావు తో 28 సినిమాలు చేశానని అందులో 22 సినిమాలు ప్రేమ కథాంశాలే అని అన్నారు. నేను తీసిన 'ప్రేమాభిషేకం' 80 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఏ సినిమాకూ లేని రికార్డు ఆ సినిమాకు ఉందని చెప్పారు. ఇక నాగార్జున కెరీర్ లో 'మజ్ను' సినిమా సూపర్ హిట్ అని అలాగే 'ప్రేమమ్' సినిమాతో కూడా నాగ చైతన్యకి అలాంటి హిట్ రావాలని అన్నారు.
ఇక హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ శృతిహాసన్ గురించి నాకు బాగా తెలుసు... ఆమె నటన బావుంటుందని, డాన్స్ బాగా చేస్తుందని, ఇంకా గ్లామర్ డాల్ అని పొగడ్తల వర్షం కురుపించేసాడు. ఇక ఈ సినిమా నాగేశ్వర రావు ఆశీస్సులతో పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు.