కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో చేపట్టిన కిసాన్ ర్యాలీ 200 కిలో మీటర్లకు చేరింది. ఈ ర్యాలీ సందర్భంగా ఆయన పూరి గుడిసెల్లోనూ, దుఖానాల్లోనూ పలు చోట్ల ఆగుకుంటూ ర్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఒక విలేకరి ఆయన్ని మీరు ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్బంగా బ్రాహ్మణ వర్గానికి ఎక్కువ మద్దతిస్తారా? అని ప్రశ్నించగా 'నాకు ఎలాంటి కులపరమైన గజ్జి లేదని, కులాలు అంటే నాకు చిరాకు, వాటిపట్ల అంతగా నమ్మకం లేదు' అని ఆయన అన్నారు. కాబట్టి 'నా మనస్సు అంగీకరించని కులాలపట్ల నేను మద్దతు తెలుపను' అని రాహుల్ వెల్లడించాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ 'నాకు అందరినీ సమంగా చూడటం ఇష్టం. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడం నా అలవాటు. రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని, అందరితో చర్చించి సమ ప్రాధాన్యం ఇచ్చేలా చూస్తాము' అన్నాడు రాహుల్.
ఇంకా రాహుల్ మాట్లాడుతూ... తాను చేస్తున్న కిసాన్ ర్యాలీ కులాలకు సంబంధించినది కాదు అని ఆయన వివరించాడు. దేశ వ్యాప్తంగా రైతులు సమస్యల్లో ఉండగా ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే ఎందుకు ర్యాలీలు చేస్తున్నారు? ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు ఉండటంతో అలా చేస్తున్నారా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు నవ్వుతూ ఇలా అన్నాడు. దేశవ్యాప్తంగా తనకు ర్యాలీలు ఉద్యమాలు చేయాలని ఉందని, అందులో భాగంగానే మొదట ఉత్తరప్రదేశ్ నుండే ప్రారంభించామని, అయితే ఇందులో ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యం లేదని అన్నాడు. కాగా ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఏం కావాలో అది తెలుసుకొని అధికార పార్టీకి తెలియజేసే వారధిగా ఇప్పుడు తమ పార్టీ ఉందని రాహుల్ వెల్లడించాడు.