మన హీరోలు మారారు. కథ, పాత్రలకి తగ్గట్టుగా కనిపించేందుకు రెడీ అంటున్నారు. ఇదివరకటిలా తాము తెరపై సూపర్‌హీరోలుగానే కనిపించాలని మాత్రం పట్టుబట్టడం లేదు. అది దర్శకులకి వరంగా మారింది. సెన్సిటివ్ కథల్ని సిద్ధం చేసుకొని కథానాయకులకి వినిపిస్తున్నారు. తద్వారా కథానాయకులు కూడా కొత్త రకమైన పాత్రల్లో దర్శనమిస్తున్నారు. అయితే మన హీరోలు మారారు కానీ, మరీ తమిళ కథానాయకులంత మాత్రం కాదు. శివకార్తికేయన్‌నే తీసుకోండి. ఇటీవల రెమో సినిమా కోసం అమ్మాయిగా మారిపోయాడు. సినిమాలో చాలా సేపు ఆయన అమ్మాయిగా కనిపించబోతున్నాడు. మరి అలాగా మన నితిన్ కనిపించగలడా? ... ముమ్మాటికీ డౌటే. కానీ రెమో తీస్తున్న దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ మాత్రం తెలుగు రీమేక్ కోసం నితిన్‌ని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నాడట. రెమో సినిమాకి కెమెరామెన్‌గా పి.సి.శ్రీరామ్ పనిచేశారు. రీమేక్ కోసం ఆయనే నితిన్ పేరును సూచించాడట. నితిన్ నటించిన ఇష్క్ సినిమాకి పి.సి.శ్రీరామే కెమెరామెన్. ఆ అనుబంధంతోనే నితిన్‌కి రెకమెండ్ చేశాడట. నితిన్ మాత్రం తమిళంలో వచ్చే రిజల్ట్‌నిబట్టి డెసిషన్ తీసుకోవాలని అనుకొంటున్నాడట. అన్నీ కుదిరితే నితిన్‌ని కూడా శివకార్తికేయన్‌లాగా లేడీ నర్సు పాత్రలో చూడొచ్చన్నమాట.