ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పెద్ద సవాలుగా మారిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు పోలవరంపై దోబూచులాచిన కేంద్రం ఈ ప్రాజెక్టు విషయంపై ఒక స్పష్టత ఇప్పించింది. ఇక నుండి పోలవరం నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు, అడ్డంకులు తొలగినట్టే అనుకోవాలి. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణానికి చెందిన రుణం మొత్తం అందించే విషయంపై వ్యవసాయ గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు (నాబార్డు) స్పష్టత ఇచ్చింది. నాబార్డు ఈ మొత్తాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆధీనంలోని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)కి ఈ రుణం అందించనుంది. కాగా ఇక నుండి పీపీఏ నుంచి డైరెక్టుగా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం రుణాన్ని నాబార్డుకు తిరిగి చెల్లించే బాధ్యత ఇకనుండి కేంద్రమే తీసుకుంటుంది.
ఈ విషయంపై ఢిల్లీలో కేంద్రమంత్రి సుజనా చౌదరి కార్యాలయంలో కీలక భేటీ జరిగింది. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన సుజనా చౌదరి..ఈ విషయంపై వచ్చిన స్పష్టతను వెల్లడించాడు. అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి దశకు చెందిన నిధులు అక్టోబర్ 15 నాటికి అందుతాయని సుజనా చౌదరి ప్రకటించాడు. దీంతో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగినట్లుగా భావించిన రాష్ట్రప్రభుత్వం సంతోషాన్ని వ్యక్తం చేసింది.