తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రెండు వారాలుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అపోలో ఆసుపత్రికి వెళ్ళాడు. ఈ సందర్భంగా అపోలో గ్రూప్ అధినెేత ప్రతాపరెడ్డి దగ్గరుండి రాహుల్ ను ఆసుపత్రిలోకి ఆహ్వానించాడు కూడాను. అయితే తీరా అక్కడికి వెళ్లిన రాహుల్ ను అక్కడి అధికారులు అమ్మను చూడటానికి వీలులేదంటూ తెగేసి చెప్పారు. ఇక తప్పక ప్రతాపరెడ్డితో రాహుల్ కాసేపు మాట్లాడి తిరిగి వెళ్ళిపోయాడు.
అయితే రాహుల్ అపోలో వైద్యులను, ప్రతాపరెడ్డిని అడిగి జయలలిత ఆరోగ్యం గురించి తెలుసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా రాహుల్... జయలలిత త్వరగా కోలుకొని సాధారణ స్థాయికి వచ్చి తమిళనాడుకు సుపరిపాలన అందిచాలని దేవుడి కోరుకుంటున్నానంటూ వెల్లడించాడు. కానీ కొంతమంది ద్వారా మాత్రం జయలలితను రాహుల్ కలిసినట్లుగా వార్తలు పొక్కుతున్నాయి. ఇందులో ఎంతమాత్రం నిజముందో తెలియడం లేదు. అధికారులు మాత్రం రాహుల్ గాంధీ కూడా జయలలితను కలవలేదని చెప్తున్నారు.
కాగా రాహుల్ కే అమ్మ దర్శనం అందలేదని తెలియగానే తమిళనాడు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. ఇన్ని రోజులు ఏ ఒక్కరికీ దర్శనమివ్వకుండా ఆసుపత్రిపై బెడ్ మీదే చికిత్స పొందుతుండటాన్ని తమిళ ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. నిన్న తన పెంపుడు కొడుకైన సుధాకర్ కు కూడా అమ్మను దర్శించుకోడానికి అధికారులు అనుమతించలేదు. అయితే తాజాగా భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మాత్రం రెండు వారాలుగా తమిళ రాష్ట్రంలో పాలనే లేదని వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని హోం మంత్రిని కోరాడు. దీంతో అసలు అమ్మకు ఏమౌతుంది అంటూ తమిళనాడులోని అమ్మ అభిమానులు ఆవేదనకు లోనౌతున్నారు.