1997 లో విడుదలైన ఒసేయ్ రాములమ్మ ఆ రోజుల్లోనే భారీ వసూళ్లు చేసిన చిత్రం. ఎక్కువ కేంద్రాలలో 125 రోజులు ఆడిన చిత్రంగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలో ఇప్పటికీ ఒసేయ్ రాములమ్మకు ఆ రికార్డు పదిలంగానే ఉంది. ఆ చిత్రం విజయ శాంతి, రామిరెడ్డి, వందేమాతరం శ్రీనివాస్ లాంటి వారెందరికో గొప్ప పేరు, గుర్తింపు సాధించి పెట్టింది. ఆ చిత్రం విడుదల వరకే అది దాసరి నారాయణ రావు చిత్రం కానీ, విడుదల తర్వాత ప్రేక్షకులు దర్శక నిర్మాతలు ఎవరన్నది చూడక, నటులను ఆయా పాత్రలతో గుర్తించటం మొదలుపెట్టారు. అలా ఇప్పటికీ నైజాంలోని కొన్ని మారు మూల ప్రాంతాలలో తన పేరు చాలా మందికి తెలీదు అని తనని రాములమ్మ అనే పిలుస్తుంటారు అని చాలా సందర్భాల్లో విజయ శాంతి చెప్పింది.
మరి ప్రేక్షకులపై అంతటి ప్రభావం చూపిన ఆ పాత్ర పోషించటానికి ఏ దర్శకుడికైనా నటులు దొరకటం అనితర సాధ్యమే. కొంత కాలం క్రితం ఆ చిత్రానికి సీక్వెల్ చేసే యోచన దాసరి చేసినప్పుడు, విజయ శాంతి తన అంగీకారాన్ని బహిరంగంగానే తెలిపింది. కానీ ఆ చిత్రం కార్య రూపం దాల్చకపోవటానికి కారణాలు బహిరంగపరచలేదు. దర్శకుడిగా దాసరికి కూడా ఆ చిత్రం తర్వాత అంతటి స్థాయి విజయాలు దక్కలేదు. అందుకే ఆ చిత్రంపై ఆయనకు మమకారం తగ్గడంలేదు. ఇప్పుడు ఆ చిత్రం సీక్వెల్ చేయబోతున్నారనే అనధికారిక ప్రకటన చేశారో, లేక నిజంగానే లక్ష్మి మంచులోని పూర్తి స్థాయి నటిని ఆయన గ్రహించారో కానీ ఒసేయ్ రాములమ్మ వంటి చిత్రానికి ఇప్పుడు ఉన్న నటులలో లక్ష్మి మంచు మాత్రమే సరిపోతుంది అని లక్ష్మి బాంబు చిత్ర గీతావిష్కరణ వేదికపై వెల్లడించారు.
స్వతహాగా దాసరి శిష్యుడు అయిన మంచు మోహన్ బాబు, ఆయన నట వారసులు కూడా దాసరి దర్శకత్వంలో నటించాలని ఎప్పుడూ ఆశ పడుతుంటారు. మంచు విష్ణు ఎర్రబస్సు చిత్రం ద్వారా ఆ కోరిక నెరవేర్చాడు. మరి ఇప్పుడు మంచులక్ష్మి సమయం వచ్చింది. ఇది కార్య రూపం దాల్చాలని కోరుకుందాం...!