ఇప్పుడు గాలి వారి ఇంటిపేరు మీడియా లో మారు మోగిపోతుంది. ఒకప్పుడు జైలుకెళ్లి మీడియాలో హైలెట్ అయిన గాలి జనార్ధన్ రెడ్డి ఇప్పుడు కూతురు బ్రహ్మణీ పెళ్లి వేడుక కారణంగా మళ్ళీ మీడియాలో హైలెట్ అవుతున్నాడు. ఒకప్పుడు అక్రమాస్తుల కేసులో మాఫియా డాన్ గా చెలామణి అయిన గాలి సిబిఐ దెబ్బకి జైలు ఊచలు లెక్కపెట్టాడు. తర్వాత బెయిల్ రానంత గట్టిగా ఈ కేసులో కూరుకుపోయాడు. అందుకే బెయిల్ కోసం కూడా జడ్జీలకు లంచం ఇచ్చి మళ్ళీ దొరికిపోయి చాలా సంవత్సరాలు జైల్లో వున్న గాలి జనార్ధన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం బెయిల్ మీద విడుదలై మళ్ళీ తన పాత జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే జైలు జీవితాన్ని గడపడంతో రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన గాలి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపొయింది. ఇక ఎలాగూ బెయిల్ మీద బయటికి రావడం కూతురికి పెద్ద వ్యాపారవేత్త కొడుకుతో పెళ్లి సెటిల్ అవ్వడం తో గాలి కుటుంబం సభ్యులు మళ్ళీ సన్నిహితులకు దగ్గరవడానికి ఈ పెళ్లి ఏర్పాట్లు ఘనంగా దేశం మొత్తం చెప్పుకునే రీతిలో జరిపించాలని నిర్ణయించుకున్నారు.
ఇక పెళ్లికి ఆహ్వాన పత్రికలతో మొదలు పెట్టిన గాలి కుటుంబం ఆహా.. అనిపించే రీతిలో పెళ్లి కార్డు డిజైన్ చేయించి ఆత్మీయులకు పంచింది. ఆ పెళ్లి కార్డుకి దాదాపు 6000 వరకు ఖర్చు చేసింది గాలి ఫ్యామిలీ. ఒక్కో పెళ్లి కార్డుకే 6000 ఖర్చు పెడితే పెళ్ళికి ఇంకెంత ఖర్చు పెడతారో అని అనుకుంటున్న వారికి జవాబుగా ..... పెళ్లి ఖర్చు 200 కోట్లు అని న్యూస్ బయటికి వచ్చింది. ఆమ్మో అంత డబ్బు ఖర్చు చేస్తున్నారా..... అని మీడియా కోడై కూయడం మొదలుపెట్టింది. ఈ విధంగా పబ్లిసిటీ అయితే మళ్ళీ అక్రమాస్తుల కేసును ఎక్కడ తిరగతోడతారో అని గాలి ఫ్యామిలీ భయపడుతున్నారట. వారు భయపడ్డట్టుగానే ఐటి శాఖ డేగ కన్ను గాలి కుటుంబం పై పడిందని సమాచారం. ఇక భయపడింది జరగనే జరుగుతుందని అనుకున్న గాలి వారు వెంటనే తేరుకుని... ఈ పెళ్లి అంతా బి శ్రీరాములు చేయిస్తున్నారని ప్రచారం మొదలు పెట్టిందట. ఇక బి శ్రీరాములైతే తనకు బ్రహ్మణీ కూతురు లాంటిదని, ఈ పెళ్లిని పెద్దగా భారీగా చెయ్యము అని.... మిడిల్ క్లాస్ వాళ్ళమయిన మేము..మధ్యతరగతి పెళ్లిలాగే ఈ పెళ్లి చేస్తామని చెబుతున్నాడట.
ఇక వెడ్డింగ్ కార్డు గురుంచి ప్రస్తావిస్తే అదేమిలేదని ఏదో కొంచెం వెరైటీగా ఉంటుందని ట్రై చేశామని పెళ్లి మాత్రం మిడిల్ క్లాస్ పెళ్లిలాగే ఉంటుందని సెలవిస్తున్నాడట శ్రీరాములు. ఇక ఈ పెళ్లి నవంబర్ 16 న బళ్లారిలో జరుగుతుందని తెలిసిన విషయమే. ఇక ఈ పెళ్లి రిచ్ గా ఉంటుందా లేక మధ్యతరగతి పెళ్లిలా ఉంటుందా అనేది మాత్రం నవంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే.