ఉగ్రవాదం కారణంగా భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదటి నుండి మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే బాలీవుడ్ నిర్మాతలను గట్టిగా మందలిస్తున్నాడు. పాకిస్తాన్ నటులతో బాలీవుడ్ నిర్మాతలు సినిమాలు చేయడానికి వీలులేదని, అలా తీసిన పక్షంలో ఆ సినిమాలు ఆడనీయమని పెద్ద ఉద్యమంలా పోరాటం చేస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ నిర్మాతలందరికీ రాజ్ ఠాక్రే భారీ షాక్ ఇచ్చాడు. అసలు ఇక నుండి ఎవరైనా పాక్ నటులు బాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం ఇస్తే ఆయా నిర్మాతలు భారత సైనిక సహాయ నిధికి రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో బాలీవుడ్ ఒక్కసారిగా కంగుతింటుంది. ఈ నిర్ణయంతో ఖాన్ త్రయానికి కూడా భారీ షాక్ ఇచ్చినట్లయింది.
పాక్ నటులను భారత్ సినీ పరిశ్రమలో అవకాశాలు ఇవ్వకుండా నిషేధించాలన్న డిమాండ్ తో కరణ్ జోహార్ చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’ విడుదల సందిగ్ధంలో పడిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా విడుదలకు కరణ్ జోహార్ నానా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎట్టకేలకు విడుదల అనుమతులను ప్రభుత్వం నుండి పొందాడు. అందులో భాగంగా కరణ్ జోహార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తో భేటీ జరిపాడు. తాజాగా జరిగిన ఈ సమావేశంలో నవనిర్మాణసేన చీఫ్ రాజ్ ఠాక్రే కూడా పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశం ద్వారా ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ దొరికింది. అయితే పాక్ నటులు నటించిన చిత్రాలు విడుదల కావాలంటే సైనిక సహాయ నిధికి తప్పకుండా రూ.5 కోట్లు చెల్లించాలని రాజ్ ఠాక్రే వెల్లడించాడు. దీనికి ఆ నిర్మాత రాత పూర్వకమైన హామీ ఇవ్వాలని కూడా డిమాండు చేశాడు. అయితే సమావేశం తర్వాత రాజ్ ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ నిర్మాతలెవరూ పాక్ నటులను సినిమాల్లోకి తీసుకో కూడదని, అలా తీసుకునే పక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించాడు. దీంతో బాలీవుడ్ పరిశ్రమంతా ఒక్కసారి ఖంగుతిన్నంత పని అయింది.