తెలుగు ప్రజలను రెండు రాష్ట్రాలుగా విభజించిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వనున్నట్లు విభజన సమయంలో తెలిపిన విషయం తెలిసిందే. కాగా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రకటించి చేతులు దులుపేసుకుంది కేంద్రం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షనేత, వైకాపా అధ్యక్షుడు జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాకోసం గట్టిగా పోరాడుతున్నారు. అయితే తాజాగా వైకాపా అధినేత జగన్, జనసేన అధినేత పవన్ పోటాపోటీలుగా ఈ అంశం ప్రధానంగా సభలు జరుపుతున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ అనంతపురంలో సభను నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. కాగా ఆ సభ పేరు సీమాంధ్ర హక్కుల చైతన్య సభ అని పెట్టినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. నవంబర్ 10వ తేదీన అనంతపురంలో ఈ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అనంతపురంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రాంగణంలో ఈ సభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సభకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి.