వరసగా చిత్రాలు చేస్తున్నప్పటికీ కమెడియన్ కమ్ హీరో సునీల్‌కి మాత్రం విజయం అనే మాట కనుచూపుమేరలో కనిపించడం లేదు. కాగా 'ఈడు గోల్డ్ ఎహే' చిత్రం కూడా బి,సిలలో ఓకే అనిపించినప్పటికీ 'ఏ' సెంటర్స్‌లో తీవ్రంగా నిరాశపర్చడంతో సునీల్‌కి కంగారు మరింతగా ఎక్కువైంది. కాగా ఆయన ప్రస్తుతం 'ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' చిత్రాల దర్శకుడు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో 'ఉంగరాల రాంబాబు' చిత్రం చేస్తున్నాడు. చిత్రం మొత్తాన్ని తన ఒక్కడి చేతుల మీదునే భరిస్తే తనకు కష్టమైన పనిగా భావించిన సునీల్ ఇప్పుడు మరో మంచి నటుడుతో కలిసి కథాభారం మోయాలని భావిస్తున్నాడు. అందుకే సునీల్ ఈ చిత్రంలో దర్శకుడు క్రాంతిమాధవ్‌ను ఒప్పించి మరీ జాతీయ నటుడు ప్రకాష్‌రాజ్ చేత ఓ కీలకపాత్రను చేయిస్తున్నాడు. ఫీల్‌గుడ్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రంలో ఆ ఫీల్ తే గలిగిన ప్రకాష్‌రాజ్ చేత ఆ పాత్రను ఒప్పించాడు కూడా...! ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్ హీరోయిన్‌కి తండ్రి పాత్రలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. చిత్రంలోని ఎమోషనల్ సన్నివేశాలకు సునీల్... ప్రకాష్‌రాజ్‌తో కలిసి జీవం పోయాలని డిసైడ్ అయ్యాడు. మొత్తానికి సునీల్ చిత్రంలో ప్రకాష్‌రాజ్ కీలకపాత్ర, అందులోనూ ఎమోషనల్ సన్నివేశాలు అంటే సునీల్‌కు కాస్త బరువు దిగినట్లు అనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.