మరో 72 రోజుల్లో వచ్చే సంక్రాంతిపైనే సినీ వర్గాల దృష్టి నిలిచింది. ఇప్పటికే సంక్రాంతి పందెంకోళ్ళు ఎవరనేది కొంతమేర తేలింది. వందవ సినిమా మార్క్ తో బాలకృష్ణ, 150 మార్క్ తో చిరంజీవి బెర్త్ లు కన్ ఫర్మ్ చేసుకున్నారు. 'శాతకర్ణి', 'ఖైదీ..' ఈ రెండు చిత్రాల కథలు దేనికవే కొత్తవి. ఇకపోతే సంక్రాంతి బరిలోనే నిలవాలని నాగార్జున నటిస్తున్న 'ఓం నమోవెంకటేశాయ' చిత్రాన్ని సైతం దర్శకుడు కె.రాఘవేంద్రరావు వేగిర పరిచారు. ఇది 'అన్నమయ్య'లాగా ఓ భక్తుడి కథ. సంక్రాంతి పోటీలో మూడు వైవిథ్యమైన చిత్రాలుంటే ఆదరణ పొందే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు కెఆర్ ఆర్ వెనకడుగు వేసే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం. ఆయనకు చిరంజీవి, బాలకృష్ణతో సత్సంబంధాలున్నాయి. పైగా 'శాతకర్ణి' మీద పోటీ అంటూ దిగితే బాలయ్య ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. కెఆర్ ఆర్ సైతం తెదేపాలోనే ఉన్నారనే విషయం తెలిసిందే. ఈ కారణం చేత ఓం నమోవెంకటేశాయ చిత్రాన్ని కాస్తంత వెనక్కి తీసుకు వెళ్ళడానికి కెఆర్ ఆర్ యత్నిస్తున్నట్టు తెలిసింది. సంక్రాంతి చిత్రాల ఫలితం తేలినవెంటనే రెండు వారాల వ్యవధిలో నాగార్జున బరిలోకి దిగే సూచనలున్నాయి. ఇక సంక్రాంతి హీరోగా పేరున్న వెంకటేశ్ 'గురు' చిత్ర నిర్మాణం సైతం వేగంగానే జరుగుతోంది.