ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వడివడిగా మారుతున్నాయి. రోజుకో రూపాన్ని ధరిస్తున్న ఆంధ్ర రాజకీయ నాయకులు వారి ఎత్తుగడ అంతా అప్పుడే రాబోవు ఎన్నికలపై పడింది. అందుకు అనుగుణంగా ఏపార్టీ నాయకులు ఆయా పార్టీల అభిమానులకు, కార్యకర్తలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కేంద్రంగా మకాం మార్చుకున్న విషయం తెలిసిందే. ఇక మెల్లి మెల్లిగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఏలూరు కేంద్రంగా ఓటు నమోదు చేయించుకోవడం తెలిసిందే. అయితే ఆ మధ్య వైకాపా అధినేత జగన్ కూడా విజయవాడకు మకాం మార్చుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగిన ప్రాంతాన్ని, ప్రదేశాన్ని కూడా ఎంచుకుంటున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కాగా ఇంతకు ముందే కాంగ్రెస్ పార్టీ విజయవాడ కేంద్రంగా పార్టీ ఆఫీసును మార్చింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా ఇంకా ఆంధ్రాకు సంబంధించిన పార్టీ వ్యవహారాలన్నీ కూడా హైదరాబాద్ నుండే జరుగుతున్నాయి. కానీ ఇప్పటికే అధికార తెదేపాగానీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలన్నీ కూడా విజయవాడ కేంద్రంగానే ప్రధానంగా సాగిస్తున్న విషయాన్ని చూస్తున్నాం. అదే 2019 ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న వైకాపా మాత్రం అందుకు తగిన కార్యకలాపాలలో చాలా జాప్యం చోటుచేసుకుంటుంది. ప్రతిపక్ష హోదాలో జగన్ ఎలాంటి ఉద్యమాలు గానీ, నిరసనలు గానీ తెలపాలన్నా కూాడా హైదరాబాద్ నుండి రావలసిన పరిస్థితిని ఇప్పటికీ ఇంకా చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు చెందిన ప్రెస్ మీట్స్ కూడా హైదరాబాద్ పార్టీ ఆపీస్ అయిన లోటస్ ఫాంట్ కేంద్రంగా జరుపుతున్న విషయం తెలిసిందే.
ఇక్కడ ప్రధానంగా వైకాపా కార్యకర్తలకు ఆందోళన కలిగించే అంశం ఏంటంటే...సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్నా కూడా ఇంకా పార్టీ కార్యకలాపాలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే జరపడం వైకాపా శ్రేణులను కలవరపరుస్తున్నట్లుగానే కనిపిస్తుంది.