ప్రస్తుతం దిల్‌రాజు అనేక చిత్రాలకు రచయితగా పనిచేసిన వేగ్నేష సతీష్ దర్శకత్వంలో తన బేనర్‌లో 25వ చిత్రంగా శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా 'శతమానం భవతి'ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం మొదటగా డిసెంబర్ ఆఖరి వారంలో క్రిస్మస్ కానుకగా విడుదల కానుందని వార్తలు వచ్చినప్పటికీ అవి తప్పని భావిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా హీరో శర్వానంద్ 'రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా' చిత్రాలను భారీ పోటీ ఉండే సంక్రాంతి కానుకగా విడుదల చేసి... అంత పోటీలోనూ తన చిత్రాలను విజయవంతంగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ప్రకారం 'శతమానం భవతి' చిత్రాన్ని కూడా శర్వానంద్ కోరిక ప్రకారం జనవరి 14న విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారని దిల్ రాజు సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం. అదే జరిగితే చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150', బాలయ్య 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లతో వారి కంటే ఆలస్యంగా శర్వానంద్ - దిల్ రాజులు రానున్నారని తెలుస్తోంది. కాగా తన 25వ చిత్రం 'శతమానం భవతి'పై దిల్‌రాజ్‌కు ఎంతో నమ్మకం. తాత-మనవళ్ల మద్య అనుబంధాన్ని ఆవిష్కరించే 'శతమానం భవతి' చిత్రం తనకు మరో 'బొమ్మరిల్లు' అవుతుందనేంతగా ఈ చిత్రంపై దిల్‌రాజుకు నమ్మకాలున్నాయి. అయినా ఇప్పటికే తనకంటూ సొంత మార్కెట్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్న దిల్‌రాజు తన 'శతమానం భవతి' చిత్రాన్ని చిరు, బాలయ్య చిత్రాల తర్వాత ఒకరోజు గ్యాప్‌లో విడుదల చేసినప్పటికీ ఈ చిత్రానికి దిల్‌రాజు కారణంగా ధియేటర్ల సమస్య వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఇక ఈ సంక్రాంతికి విడుదలకానున్న చిరు, బాలయ్య, శర్వానంద్‌ల చిత్రాలు మూడింటికి మూడు ప్రత్యేకతలున్నాయి. తమిళ 'కత్తి' రీమేక్‌గా రూపొందుతున్న 'ఖైదీనెంబర్ 150' చిత్రం రీమేక్ కావడం, దాన్ని చిరు చేస్తుండటంతో ఆయన అభిమానులందరూ సిడీలు వేసుకొని మరీ ఈ చిత్రాన్ని వీక్షించారు. అలా అందరికీ తెలిసిన కథతో 'ఖైదీ నెంబర్ 150' చిత్రం విడుదల కానుంది. ఇక బాలయ్య నటిస్తోన్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' విషయానికి వస్తే ఈ చిత్రానికి టైటిల్‌గా ఆ పేరు పెట్టేవరకు ఆయన ఎవరో, ఎప్పుడు, ఎక్కడ పాలించారో ఎవ్వరికీ తెలియదు. చిత్రం ప్రకటించిన తర్వాత సీనియర్ హిస్టరీ లెక్చరల్‌లతో పాఠాలు చెప్పించుకొని, ఆయన జీవిత చరిత్రను కొని మరీ కొందరు చదివారు. కానీ ఆ మహాయోదుడైన గౌతమిపుత్ర శాతకర్ణి నిజజీవితం ఎవ్వరికీ పెద్దగా అర్దం కాలేదు. ఇక ఈ చిత్రానికి కమర్షియల్ టచ్ ఇవ్వడానికి అందులో క్రిష్ ఏమేమి మ్యాజిక్‌లు చేస్తాడో ఎవ్వరికీ అర్ధం కాదు. ఇలా 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం ఎవ్వరికీ తెలియని సబ్జెక్ట్‌తో రూపొందుతోంది. 'కత్తి' రీమేక్‌లాగా ఈ చిత్రం కథ ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఇక శర్వానంద్ - దిల్‌రాజు కాంబినేషన్‌లో వస్తున్న 'శతమానం భవతి' అచ్చమైన తెలుగు చిత్రం. ఇందులో తాతా - మనవళ్ల మద్య అనుబంధాన్ని గొప్పగా ఆవిష్కరిస్తున్నారు. ఆల్‌రెడీ 'బొమ్మరిల్లు'తో పోలిక వచ్చింది కాబట్టి 'శతమానం భవతి' చిత్రం ప్రేక్షకులందరికీ కొద్ది కొద్దిగా అవగాహన ఉన్న కథతో విడుదలకు సిద్దమవుతోంది. ఇక 'శతమానం భవతి' ఆడియోను డిసెంబర్ 18న విడుదల చెయ్యాలని దిల్‌రాజు భావిస్తున్నాడు. ఈ ఆడియో వేడుకకు తాను తీసిన 25 మంది హీరోలను పిలవాలనేది దిల్‌రాజు కోరిక. మరి 'ఖైదీనెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి', 'శతమానం భవతి' చిత్రాలలో ఏ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది.