తెలుగు ప్రజలు ఒక్కటిగా ఉన్నప్పుడు నంది అవార్డుల ఉత్సవాన్ని ప్రభుత్వం ఓ ఉత్సవంలా, పండుగలా నిర్వహించేది. అయితే ఈ రాష్ట్ర విభజన గొడవలు మొదలైనప్పటి నుండి నంది అవార్డులను పూర్తిగా పక్కనబెట్టింది ప్రభుత్వం. దాదాపు ఐదు సంవత్సరాల నుండి ప్రభుత్వంగానీ, పరిశ్రమ గానీ ఆ ఊసే ఎత్తడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విభజనకు గురైన తర్వాత కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డుల విషయం పట్టించుకోక పోవడం ఎవరికీ అంతుపట్టని విషయంగా పరిణమించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆ విషయాన్ని గురించి ఈ మధ్య కాస్త పట్టించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డులకు సంబంధించి తాజాగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నంది అవార్డులకు బదులు సింహా అవార్డులుగా పేరు మార్చి అవార్డులను ప్రకటించాలని సూచించినట్లు తెలుస్తుంది. దీన్నిబట్టి ఇక నంది స్థానంలో సింహా అవార్డులు రానున్నాయన్నమాట.
అయితే ఈ నంది అవార్డుల స్థానంలో ఇచ్చే సింహా అవార్డులపై త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఓ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. ఇంకా సింహా అవార్డులే కాకుండా తెలంగాణకు సంబంధించిన మహానుభావులైన సినీ పెద్దలు, ప్రముఖులు అయిన ప్రభాకర్ రెడ్డి, పైడి జైరాజ్, కత్తి కాంతారావు, దాశకథి కృష్ణమాచార్యుల వంటి వారి పేర్లతో కూడా అవార్డులను ప్రకటించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధమౌతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా సంగీత దర్శకుడు చక్రి పేరుతో కూడా ఓ అవార్డును ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే 2017 వ సంవత్సరం నుండి వరుసగా సింహా అవార్డులను ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఓ ప్రకటణను వెల్లడించనున్నట్లు తెలుస్తుంది.