చాలామంది దర్శకులు తమ సినిమాల్లో కొన్ని పవర్ ఫుల్ పాత్రల కోసం కొంతమంది నటుల్ని సెలెక్ట్ చేసుకుని వారికి లైఫ్ ఇస్తూ వుంటారు. పరాయి భాషా నటుల్ని పట్టుకొచ్చి మరీ వారికీ సినిమాలో అవకాశం ఇచ్చి వారి కెరీర్ ని మలుపు తిప్పుతూ వుంటారు. కొరటాల శివనే తీసుకోండి 'జనతా గ్యారేజ్' లో మోహన్ లాల్ కి అవకాశమిచ్చి టాలీవుడ్ లో మంచి పేరు కొట్టెయ్యడానికి సహాయపడ్డాడు. అలాగే చాలామంది దర్శకులు ఇలానే చేస్తున్నారు.
ఇక బోయపాటి సినిమాలో ఎవరినైనా నటుడిగా సెలెక్ట్ చేసాడు అంటే అతని సుడి తిరిగిపోతుందనేది అందరూ ఒప్పుకునే మాట. బాలకృష్ణ కి 'సింహ', 'లెజెండ్' వంటి సినిమాలు హిట్స్ ఇచ్చాడు. ఇక లెజెండ్ లో విలన్ గా జగపతి బాబుని తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ కి గట్టి పునాది వేసాడు. లెజెండ్ సినిమా జగపతి బాబు కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా. ఇక లెజెండ్ దెబ్బకి జగపతి బాబు ఎక్కడికో వెళ్ళిపోయాడు. బోయపాటి తర్వాత చేసిన సరైనోడు సినిమాలో కూడా హీరో ఆది పినిశెట్టిని విలన్ గా తీసుకుని కేక పెట్టించాడు. ఇక అది కూడా హీరో అల్లు అర్జున్ కి పోటీగా చేసాడనే కామెంట్స్ పడ్డాయి.
ఇక ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ ని డైరెక్ట్ చెయ్యబోయే సినిమాలో తమిళం నుండి ఒక పవర్ ఫుల్ నటుడుని తీసుకురాబోతున్నాడట బోయపాటి. అతనెవరో కాదు తమిళ నటుడు శరత్ కుమార్. శరత్ కుమార్ ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బన్నీ సినిమాలో నటించాడు. ఆదర్శాలున్న రైతుగా ఆ సినిమా లో కనిపించాడు. కానీ ఆ సినిమా శరత్ కుమారికి పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. ఇక కొన్ని చిన్న చితక తెలుగు సినిమాల్లో నటించిన శరత్ కుమార్ కి ఇప్పుడు తమిళంలో కూడా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక బోయపాటి ఆఫర్ ని శరత్ కుమార్ వెంటనే ఒప్పుకున్నాడని అంటున్నారు.
ఈ సినిమాలో శరత్ కుమారికి ఒక పవర్ ఫుల్ పాత్రని బోయపాటి ఇస్తున్నాడని అంటున్నారు. మరి బోయపాటి సినిమాతో శరత్ కుమార్ సుడి తిరిగి మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతాడేమో చూద్దాం. శ్రీనివాస్ - బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో శ్రీనివాస్ కి జోడిగా రకుల్ ప్రీత్ నటిస్తుంది.