భారత ప్రధాని నరేంద్ర మోడి పెద్ద నోట్లను రద్దు చేసి బ్లాక్ మనీపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై పలువురు పలురకాలుగా మోడీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నల్లధనాన్ని భారీ స్థాయిలో నిల్వ చేసుకున్న నల్ల కుబేరులు మాత్రం మోడీ వ్యవహారంపై లోలోపల కాస్త కుమిలిపోతుంటే, అలా కాకుండా ఎప్పటికప్పుడు వైట్ చేసుకుంటున్న వారు మాత్రం మోడి నిర్ణయాన్ని తెగ మెచ్చేసుకుంటున్నారు. అలా మోడీని అంతా శభాష్ అంటూ కీర్తిస్తున్నారు. అనూహ్యంగా మోడీకి వచ్చిన ఈ నిర్ణయంపై టాలీవుడ్ వర్గాల నుంచి కూడా మంచి స్పందనే వచ్చింది. అందులో చాలా మంది మోడీ తీసుకున్న నిర్ణయానికి జేజేలు పలికిన వారే ఎక్కువ శాతం ఉన్నారు. తెలుగు సినీ తారలు మోడీ నిర్ణయంపై ఎవరి స్టైల్లో వారు స్పందిస్తున్న తీరుకు నెటిజన్లు ఆశ్చర్యానికి లోనౌతున్నారు.
కాగా మోడీ తీసుకున్న నిర్ణయంపై కొంతమంది సినీ రంగానికి చెందిన తారలు సినిమాటిక్ గా స్పందిస్తున్న తీరును నెటిజన్లంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. కొంతమంది మోడీని ఆకాశానికి ఎత్తేస్తుంటే, మరి కొంతమంది మాత్రం మోడీ నిర్ణయం సరైనదంటూ లోలోపల మురిసిపోతున్నారు. మన సినిమా వాళ్ళు సినిమా డైలాగ్ లతో మోడీ నిర్ణయంపై అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మోడీ తరహా పాలనలో భారత్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా అదిరిపోయేలా ఉందని కొందరంటే, ఇది మరీ హైలీ మోడిఫికేషన్ అని కొంతమంది అన్నారు. అయితే అందరూ ఒకెత్తయితే హీరో నాని స్పందన మాత్రం నెటిజన్లను ప్రత్యేకంగా ఆకర్షించింది. మోడీ తీసుకున్న నిర్ణయంపై నాని స్పందిస్తూ.. ‘ అప్పుడెప్పుడో 1947లో గాంధీగారు కొబ్బరికాయ కొట్టారు, ఇప్పుడు అంటే 2016లో మోడీగారు గుమ్మడికాయ కొట్టారు. కాగా దీనికి ఇంకా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఇండియా విడుదలవుతుంది’ అంటూ కొత్త నోట్ల విడుదల విషయంపై కూడా నాని ట్విట్టర్ ద్వారా డిఫరెంట్ గా వ్యక్తీకరించి నెటిజన్లను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాడు.