పెద్ద నోట్ల రద్దుపై దక్షిణాది సినీ ప్రముఖులు స్పందించారు. మోదీ నిర్ణయాన్ని స్వాగతించారు. రజనీ, కమల్, నాగ్ వంటి స్టార్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు. కానీ మన మెగాస్టార్ మాత్రం దీనిపై స్పందించిన దాఖలాలు లేవు. మెున్నటి వరకు ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా ఉండి, ఇప్పుడు రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్న మెగాస్టార్ ప్రజలతో సంబంధాలు తెంచుకున్నట్టు కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యునిగా ప్రజలవైపు మాట్లాడాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించడమో లేదా వ్యతిరేకించడమో చేయాలి. పైగా ఆయన పార్లమెంట్ సభ్యునిగా ప్రతినెల జీతంగా ప్రజాధనాన్ని తీసుకుంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని అంతా భావిస్తున్నారు. ఆపార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి సైతం మోదీ పెద్ద నోట్లు రద్దు చేయడం పట్ల హర్షం వెలిబుచ్చారు. అంటే పార్టీ పాలసీ ప్రకారం స్పందించినా, లేదా టాలీవుడ్ హీరోగా అయినా సరే చిరు మాట్లాడాలి. కానీ ఆయన నుండి ఎలాంటి ప్రకటన మీడియాకు చేరలేదు. చిరు దృష్టి ఇప్పుడు కేవలం సినిమాపైనే ఉందని, మరేది ఆలోచంచడం లేదని సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి అభిప్రాయంతో ఉన్న చిరంజీవిగారూ రైతుల సమస్యపై తీస్తున్న సినిమాలో నటిస్తుండడం గమనార్హం.