పెద్ద నోట్ల రద్దుతో నల్లదనం ఏ మేరకు వెలికివస్తుందో కానీ దాని ప్రభావం మాత్రం సినిమా కలక్షన్లపై స్పష్టంగా కనిపించింది. బుధవారం ఉభయ రాష్ట్రాల్లో థియేటర్లు వెలవెలబోయాయని ఎగ్జిబిటర్లు వాపోయారు. చిల్లర నోట్లు లేని కారణంగా టికెట్ కౌంటర్లు బోసి పోయాయి. ఉన్న నోట్లను జాగ్రత్త చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రేక్షకులు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన థియేటర్లలో రోజువారి కలక్షన్లు 15 వేల నుండి రెండు వేలకు పడిపోయాయని తెలిసింది. థియేటర్లే కాదు హోటల్స్, బార్లు, షాపింగ్ మాల్స్, హాస్పటల్స్ సైతం పెద్ద నోటు బాధతప్పలేదు. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకునే ప్రేక్షకులు మాత్రం మల్టీప్లెక్స్ లో సందడి చేశారు.
శుక్రవారం విడుదలవుతున్న సినిమాలపై పెద్ద నోటు ప్రభావం ఉంటుందని భయపడుతున్నారు. గురువారం నుండి నోట్లు మార్చుకునేందుకు బ్యాంకులు తెరిచారు. అయితే దీనికి పరిమితి ఉంది. కాబట్టి మార్చుకున్న నోట్లను థియేటర్లలో ఖర్చు పెట్టేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవచ్చు. శుక్రవారం నుండి ఏటిఎమ్ లలో వంద రూపాయల నోట్లు అందుబాటులోకి వస్తాయి కాబట్టి సినిమాలకు కొంతమేర కలక్షన్లు పెరుగుతాయని భావిస్తున్నారు. నాలుగైదు రోజుల్లోనే పరిస్థితి మారుతుందని సినీ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.