జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పేరుతో జనాల్లోకి భలే హుషారుగా దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే తిరుపతి, కాకినాడ భారీ బహిరంగ సభల తర్వాత రాయలసీమ ప్రాంతమైన అనంతపురాన్ని ఎంచుకొని ఆ ప్రాంతంలో కూడా దిగ్విజయంగా భారీ బహిరంగ సభను నిర్వహించాడు. దాంతో ప్రజలలో వస్తున్న స్పందనను చూసి పవన్ అసలు ఇప్పుడు ఆగలేకుండా ఉన్నాడు. దీంతో తర్వాత వెంటనే మరో సభ మరో ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆదిశగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తన ప్రసంగాలతో జనాలను చైతన్య పరచి అలా తన రాజకీయ భవిష్యత్తును కొనసాగించాలని కోరుకుంటున్నాడు పవన్.
అందుకోసమనే పవన్ తన తరువాత సభను ఉత్తారాంధ్రలో పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తుంది.పవన్ 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడంతో ప్రజల్లోనూ, జనసేన కార్యకర్తల్లోనూ ఉత్సాహం నెలకొంది. కరువు ప్రాంతమైన అనంతపురంల ో తన ప్రసంగంతో అక్కడి ప్రజలను అమితంగా ఆకట్టుకున్న పవన్, రాష్ట్రంలో బాగా వెనకపడ్డ ప్రాంతమైన ఉత్తరాంధ్రలో కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ దిశగా ప్రజలను ఆకట్టుకొనేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తుంది. కాగా పవన్ ఈ సభను విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు జనసేన కార్యకర్తలు. అయితే సహజంగా పవన్ కు ఉత్తరాంధ్ర అంటే అభిమానమని, అందుకనే ఎప్పుడూ పవన్ శ్రీకాకుళం యాసలో జానపద గేయాలను పాడుతూ ఉంటారని కూడా జనసేన వర్గాలు అంటున్నాయి. ఇంకా పవన్ గత ఎన్నికల్లో కూడా వైకాపా నుండి జయమ్మను ఓడించి హరిబాబు గెలవటానికి పవన్ చాలా కీలకంగా మారాడన్న విషయం కూడా తెలిసిందే.