మణిరత్నం చిత్రాలంటే ఎంతకాలం తర్వాత, ఎన్ని సార్లు చూసినా క్లాసిక్ చిత్రాలుగానే మనకు గుర్తుండిపోతాయి. అలాంటి మణిరత్నం ఈమధ్యకాలంలో ట్రెండ్‌ను ఫాలోకాలేక నానా ఇబ్బందులు పడి ఎట్టకేలకు 'ఓకే బంగారం' చిత్రంతో నేటి యువతరం పోకడలను నిశితంగా చూపిస్తూ నేటి ట్రెండ్‌ను అనుగుణంగా ఈ చిత్రాన్ని తీసి తమిళంతో పాటు తెలుగులోనూ సక్సెస్ చేశాడు. కాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ విజయంలో నిర్మాత దిల్‌రాజుది ప్రత్యేకపాత్ర. తెలుగులో ఈ చిత్రానికి విడుదలకు ముందే హైప్ రావడానికి, మంచి విజయం సాధించడానికి దిల్‌రాజుపై అందరికీ ఉన్న నమ్మకంతో పాటు ఈ చిత్రానికి ఆయన తెలుగులో చేసిన ప్రమోషన్ కూడా ఒక కారణం అని మణిరత్నం నమ్మాడు. దాంతో 'ఊపిరి, కాష్మోరా' చిత్రాల ద్వారా తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తిని హీరోగా పెట్టుకొని, ఆదితిరావు హైద్రీని హీరోయిన్‌గా తీసుకొని ఆయన ప్రస్తుతం ఓ చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ హక్కులను కూడా ఆయన దిల్‌రాజుపై ఉన్న నమ్మకంతో కాస్త తక్కువరేటుకే దిల్‌రాజుకు ఇచ్చాడు. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రం 'డ్యూయెట్' అనే పేరుతో తెలుగులో విడుదల కానుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం తమిళ, తెలుగుభాషల్లో ఒకేసారి విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలో మణిరత్నం మరోసారి నేటి ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాడు. అది కూడా తనకి నచ్చని ట్రెండ్ కావడం విశేషం.
ఆయన తీసిన చిత్రాలలో 99శాతం చిత్రాలను ఆయన కేవలం ఇండియాలోనే తీశాడు. రజనీకాంత్ అయినా కమల్‌హాసన్ అయినా, చివరకు బాలీవుడ్ బాద్‌షాతో షారుఖ్‌ఖాన్‌తో తీసిన 'దిల్‌సే' చిత్రాన్ని సైతం ఆయన షూటింగ్ మొత్తం ఇండియాలోనే తీశాడు. తన 'రోజా, ముంబాయి' వంటి చిత్రాలను భారత్, పాకిస్తాన్ బోర్డర్ అయిన కాశ్మీర్ వంటి ప్రమాదకరమైన సరిహద్దుల్లో తీశాడే కానీ అవకాశం ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్లలేదు. ఇక ఆయన కేవలం 'అమృత', 'గురు' చిత్రాల కోసం మాత్రమే పక్క దేశమైన శ్రీలంక, ఇస్తాంబుల్ ప్రాంతాలకు వెళ్లాడు. కానీ నేడు నడుస్తున్న ట్రెండ్ డిఫరెంట్‌గా ఉంది. అది చారిత్రక చిత్రమైనా, సోషియో ఫాంటసీ అయినా, చివరకు 'బాహుబలి' లాంటి చిత్రమైనా సరే, హీరోల ఇమేజ్‌తో సంబంధం లేకుండా పాటల కోసమైనా కొత్త కొత్త దేశాలకు వెళుతూ, అక్కడి కొత్త కొత్త ప్రకృతి అందాలను చూపిస్తున్నారు. సినిమా మొత్తాన్ని దేశంలోనే తీసినప్పటికీ పాటలను మాత్రం విదేశాల్లో చిత్రీకరించడానికే మన హీరోలు, దర్శకనిర్మాతలు సిద్దమవుతున్నారు. ఇప్పుడు అదే ట్రెండ్‌ను మణిరత్నం సైతం ఫాలో అవుతున్నాడు. తాను కార్తితో తీస్తున్న 'డ్యూయెట్' చిత్రంలోని ఓ సాంగ్ కోసం ఆయన ఏకంగా యూరప్‌కు వెళ్తున్నాడు. వాస్తవానికి ఆ పాటను విదేశాల్లో తీయాల్సినంత తప్పని పరిస్థితి కాదని, స్టోరీ కూడా అందుకోసం యూరప్ వెళ్లేందుకే డిమాండ్ చేసే పరిస్దితి కూడా కాదని తెలుస్తోంది. కానీ నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ఆయన ఈ ఒక్క పాటకోసమైనా యూరప్ అందాలను తెరపై చూపించాలని భావించాడు. మరి మన దేశంలోని అందమైన లొకేషన్లను వెతుక్కుని, చివరకు ఎన్నో ఏళ్లుగా మనం చూస్తున్న ఊటీ, కొడైకెనాల్ వంటి అందాలను కూడా నాగార్జున నటించిన 'గీతాంజలి'లో సరికొత్తగా చూపించి, తెలుగు వారి చేత కూడా సెహభాష్ అనిపించున్న ఈ క్రియేటివ్ జీనియస్ ఎవ్వరూ చూడని కొన్ని యూరప్ అందాలను ఇంకెంత అందంగా చూపిస్తాడో? చూద్దాం.