ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసిన వారి జాబితాలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు కూడా చేరిపోయాడు. ఎందుకంటే ఆయన ప్రజా సమస్యలకంటే ఇంటి సమస్యలను తీర్చుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని బాబు మండిపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గంటా కూడా చంద్రబాబుతో అంతే స్థాయిలో ఎడ మొహం- పెడమొహాన్ని మెయిన్ టైన్ చేస్తున్నట్లుగానే తెలుస్తుంది. అయితే విశాఖ రాజకీయాల్లో లోకేష్ ఆధిపత్యం పెచ్చుమీరిపోతుండటంతో గంటా కూడా కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి భవిష్యత్తులో గంటా ఎలాంటి టర్న్ తీసుకుంటారనేది కూడా రాజకీయంగా కలకలం సృష్టిస్తుంది.
అయితే గంటా ఈ మధ్య కొడుకును హీరో చేయడంపై ఎక్కువ దృష్టిపెట్టినట్లుగా టాక్. మరొక విషయం ఏంటంటే.. అప్పట్లో టాలీవుడ్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వైజాగ్‌కి తీసుకెళ్తానని ప్రతిజ్ఞపూనిమరీ అందుకోసం అక్కడ భూములను కూడా కొనుగోలు చేసి అంతవరకు సక్సెస్ సాధించాడు గంటా శ్రీనివాస్ రావు. సినీ పరిశ్రమ విశాఖ నగరానికి తీసుకొస్తే.. ఉపాధి అవకాశాలు భారీగా పెంచవచ్చని ఆ రకంగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించాడు గంటా. కానీ అది భూములను కేటాయించడం వరకే జరిగింది కానీ, అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా గంటా.. సినీ పరిశ్రమను విశాఖకు తరలించే విషయాన్ని పూర్తిగా పక్కనబెట్టి, తన కుమారుడు రవితేజను హీరోగా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఇప్పుడు ఉన్న సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో తన కుమారుడిని హీరోగా నిలబెట్టాలని గంటా తెగ తాపత్రయ పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం గంటా రవితేజ హీరోగా జయంత్.సి.ఫరాన్జీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇకపోతే గంటా శ్రీనివాస్ రావు మెగా మనిషే కాబట్టి ఆ ఫ్యామిలీ అండదండలు గంటాకి పుష్కలంగా ఉంటాయి. ఆ దిశగా బాగా ఆలోచించిన గంటా రవితేజ సినిమాకు థియేటర్ల సమస్య ఉండదని, ఇంకా తనకు పరిశ్రమతో ఉన్న పరిచయాలతో సినిమా బిజినెస్ కు సంబంధించిన ఇబ్బందులు కూడా అధిగమించవచ్చని భావిస్తున్నాడు గంటా శ్రీనివాస్ రావు. అయితే విశాఖలో పరిశ్రమని అభివృద్ధి చేయకపోతే గంటా శ్రీనివాస్ రావుకు భవిష్యత్తులో రాజకీయంగా గడ్డు పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వస్తుంది. చూద్దాం గంటా శ్రీనివాస్ రావు కొడుకుతో పాటు విశాఖ సినీ పరిశ్రమ సంగతి కూడా చూస్తాడా? లేక కేవలం కొడుకును హీరోగానే చూసుకుంటాడా? అనేది.