తమిళనాడు సీఎం, పురచ్చితలైవి 'జయ' అమ్మ ఆరోగ్యం బాగా లేదు. దాంతో ఆమె చాలాకాలంగా హాస్పిటల్‌లోనే ఉంది. ఆమె ఆర్యోగంపై తమిళుల్లో పలు అనుమానాలు ఉన్నాయి. ఆమె త్వరగా కోలుకొని పరిపాలన చేయాలని ఆమె అభిమానులు ఎన్నో రోజులుగా పూజలతో పాటు ప్రార్దనలు చేస్తూ కనిపించిన దేవుళ్ల కల్లా మొక్కులు మొక్కుతున్నారు. జయలలిత ఆరోగ్యం తమిళ రాజకీయ వర్గాన్ని ఎంతగా ఆందోళన పెడుతోందో తెలిసిందే. ఇలాంటి పరిస్థితే ఇటీవల 'రోబో2' షూటింగ్ సమయంలో ఆరోగ్యం బాగా లేక రజనీకాంత్ అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పుడు కూడా ఆయన అభిమానులు, సినీ వర్గాలను కూడా అంతగానే కంగారు పెట్టింది. ఆయన కిడ్నీ చెడిపోయిందని, దాని మార్పిడి చేశారనే వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు, ఆయన దర్శకనిర్మాతలు.. ఇలా అందరూ ఆందోళన చెంది కనిపించని దేవుళ్లని కూడా మొక్కుకున్నారు. ఆయన రంజిత్ పా దర్శకత్వంలో కళైపులి థాను నిర్మాతగా 'కబాలి' చిత్రం చేస్తుండగానే శంకర్ దర్శకత్వంలో 'రోబో2' ప్రారంభించాడు. ఈ చిత్రం మేకప్ విషయంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని, అందుకే రజనీ ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్లాడని ఆయన కుటుంబ సభ్యులు అందరికీ సర్దిచెప్పారు. ప్రస్తుతం రజనీ వయసు 70 ఏళ్లను సమీపిస్తోంది. ఇక ఈ వయసులో ఆయన ఆరోగ్యం సరిగా సహకరించదని, అందునా కిడ్నీ మార్చారు కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా ఆయనకు ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపుతుందని, కాబట్టి రజనీకి శంకర్ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ విలన్‌గా, అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న 'రోబో2' చిత్రం తర్వాత ఆయన నటనకు గుడ్‌బై చెప్పడం ఖామయనే మాటలు వినిపించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన భార్య లత, కూతుర్లు సౌందర్య, ఐశ్వర్య, అల్లుడు ధనుష్‌కు కూడా రజనీ ఇక సినిమాల్లో నటించడం ఇష్టం లేదని, ఈ విషయంలో వారు రజనీని వారిస్తున్నారని, రిటైర్‌మెంట్‌కు బలవంతం చేస్తున్నారని తెలుస్తోంది.
సాధారణంగా రజనీకాంత్ చాలా గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తుంటాడు. ఆయన ఇమేజ్‌కు, క్రేజ్‌కు తగ్గ స్టోరీలు, దర్శకనిర్మాతలు.. ఇలా అన్నీ నచ్చితేనే ఆయన సినిమా ఒప్పుకుంటాడు. దీంతో ఆయన చిత్రాలకు భారీ గ్యాప్ తప్పకుండా వస్తోంది. ఒక చిత్రం చేసిన మూడేళ్లకు గానీ మరో చిత్రం రావడం లేదు. అలాంటిది ఆయన 'కబాలి' చిత్రం షూటింగ్ పూర్తి కాకుండానే శంకర్ 'రోబో2' చిత్రం ప్రారంభించాడు. అందునా శంకర్ దర్శకుడంటే ఏ హీరో అయినా భయపడతాడు. తనకు కావాల్సిన విధంగా సీన్ వచ్చే వరకు ఆయన నిద్ర పోడు. సినిమాలోని క్యారెక్టర్ డిమాండ్ చేస్తే శారీరకంగా కూడా ఆయన ఆర్టిస్టులను నిద్రపోనివ్వడు. 'ఐ' చిత్రం సమయంలో విక్రమ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన గెటప్‌ల కోసం శంకర్ తనను ఎంతగా హింస పెట్టాడో కాస్త పాజిటివ్‌గా చెప్పుకొచ్చాడు. అలాంటి శంకర్ దర్శకత్వంలో రజనీ 'రోబో2'లో రోబో చిట్టిగా ఎంత కష్టపెడుతుంటాడో అందరూ అర్ధం చేసుకున్నారు. కానీ రజనీ తనలోని నటుడిని శాటిస్‌ఫై చేయడం కోసం 'రోబో2'ను ఎంచుకుని ఒప్పుకున్నాడు.
కాగా ఇటీవలే మరలా అనారోగ్యం తిరగబెట్టడంతో మరోసారి అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకొని వచ్చాడు. తాజాగా ఆయన 'రోబో2' షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం శంకర్.. రజనీతో ఎంతో కష్టమైన చిట్టి పాత్రలోని సన్నివేశాలను చేయిస్తున్నాడు. అయితే రజనీ 'రోబో2' షూటింగ్‌లో ఉండగానే 'కబాలి' ఫేమ్ రంజిత్ పా దర్శకత్వంలో మరో చిత్రం ఓకే చేశాడు. ఈ చిత్రానికి ఆయన అల్లుడు ధనుష్ నిర్మాత. కాగా 'కబాలి' సమయంలోనే ఆ చిత్ర నిర్మాత కలైపులి థాను నిర్మాతగా రజనీ 'కబాలి'కి సీక్వెల్ చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ తాజాగా కళైపులి థాను చాంబర్‌లో 'కబాలి2' అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించాడు. కాగా నిన్నమొన్నటి వరకు ధనుష్ నిర్మాతగా రంజిత్‌పా దర్శకత్వంలో రజనీ చేసే చిత్రమే 'కబాలి2' అని అందరూ అనుకున్నారు. 'కబాలి' తీసిన కలైపులి థాను నుంచి ఈ సీక్వెల్ చిత్రాన్ని ధనుష్ టేకప్ చేశాడని, దనుష్ నిర్మాతగా రజనీ చేసే చిత్రమే 'కబాలి2'అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు చాంబర్‌లో కలైపులి థాను 'కబాలి2' అనే టైటిల్ రిజిష్టర్ చేయించడంతో గందరగోళం ఏర్పడింది. కొంత మంది ధనుష్ నిర్మించే చిత్రమే 'కబాలి2'అని, ఈ చిత్రానికి కలైపులి థాను ధనుష్‌తో సహ నిర్మాతగా పనిచేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. మరికొందరు మాత్రం ధనుష్ చేసేది వేరే సబ్జెక్ట్ అని, ఆ చిత్రంతో పాటు రజనీ కలైపులిథానుకు, రంజిత్‌పాకు వేరుగా చేస్తున్నాడని అంటున్నారు. అదే నిజమైతే 'రోబో2' షూటింగ్ జరుగుతుండగానే రజనీ రెండు చిత్రాలకు కమిట్ అయినట్లు అవుతుంది. మొత్తానికి అనారోగ్యకారణాల వల్ల రజనీకి 'రోబో2'నే చివరి చిత్రం అని భావించిన విశ్లేషకులు ఈ వయసులో, ఆరోగ్యం బాగా లేకపోయినా రజనీ ఇప్పటికీ చూపుతున్న దూకుడు చూసి నివ్వెరపోతున్నారు. రజనీని ఆమధ్య ఎవరో మీ రిటైర్‌మెంట్ ఎప్పుడు? అని ప్రశ్నిస్తే.. సమాధానంగా నవ్వుతూ.. ఏం ..నన్ను చూసి చూసి బోర్ కొట్టిందా? చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలనేది నా కోరిక అన్నాడు. ఆ విధంగా చూస్తే రజనీ తన మాట నిలబెట్టుకునేలా దేవుళ్లు దీవించారని ఒప్పుకోకతప్పదు.