పెద్ద నోట్ల రద్దు ప్రభావం సినిమా ఇండస్ట్రీ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కడికక్కడ సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. కార్మికులకు వేతనాలివ్వడానికి నిర్మాతల దగ్గర డబ్బులేక కాదు ఆ డబ్బు ని మార్చి ఇవ్వడానికి దారుల్లేక అలా జరిగింది. ఇక షూటింగులకే దిక్కులేకపోతే సినిమాల విడుదల ఏవిధంగా జరుగుతుంది. ఇదలా ఉంటే విడుదలకు సిద్ధమైన సినిమాలు కూడా పెద్దనోట్ల రద్దు ప్రకటనతో విడుదల వాయిదాలు వేసుకుంటున్నాయి. ఏదో కొన్ని సినిమాలను ధైర్యం చేసి విడుదల చేసినా వారికి చేతికి చిప్ప దొరికే పరిస్థితి ఏర్పడింది. ఇక కొంతమంది హీరోలు మాత్రం ఏదో పెదాలకు నవ్వుపూసుకుని తిరుగుతున్నారు కానీ లోలోపల మాత్రం కుమిలిపోతున్నారని టాక్. అయితే మోడీ దెబ్బకి సినిమా షూటింగులు ఆగిపోయి కొంతమంది సినిమా కార్మికులు రోడ్డున పడ్డారు.
ఇదంతా అలాగుంటే ఒక హీరో మాత్రం మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రభావం తన సినిమా పై ఏమాత్రం పడలేదంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని. నాని దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న 'నేను లోకల్' సినిమా షూటింగ్ మాత్రం వేగంగా జరుపుకుంటుంది. మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఈ సినిమా షూటింగ్ ఫై పడకుండా దిల్ రాజు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడని సమాచారం. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో వున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా కంప్లీట్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా విడుదల చెయ్యాలని గట్టి నిర్ణయం తో ఉన్నారట.
ఇక ఈ సినిమా ఇప్పటికే భారీ లెవెల్లో మార్కెట్ జరిగిపోయిందని అంటున్నారు. 'నేను లోకల్' సినిమాలో నానికి జోడిగా 'నేను శైలజ' ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక ఈ సినిమాతో మరోసారి హిట్ కొట్టడానికి నాని రెడీ అయిపోతున్నాడు.