రామ్‌చరణ్ ప్రస్తుతం ఒకేసారి రెండు బాధ్యతలను తలమీదకు ఎత్తుకున్నాడు. తన చిత్రాలు ఇటీవల వరుసగా నిరాశపరుస్తుండే సరికి ఆయన తమిళ రీమేక్ 'తని ఒరువన్' చిత్రాన్ని గీతాఆర్ట్స్ బేనర్‌పై అల్లుఅరవింద్ నిర్మాతగా 'ధృవ' పేరుతో తీస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆయన చేయడంపై చాలామందిలో అనుమానాలున్నాయి. ఈచిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎక్కడం చాలా కష్టమని, అందునా 'కిక్2'తో దారుణంగా విఫలమైన సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నందున ఈ చిత్రం సాధించబోయే ఫలితంపై విశ్లేషకుల్లో పలు సందేహాలున్నాయి. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్2న విడుదల చేయాలని భావించినప్పటికీ ఈ చిత్రం మోదీ తీసుకున్న కరెన్సీ నిర్ణయంతో ఇబ్బందులను పడుతోంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి తరుణంలో సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ ఈ చిత్రం విడుదలకు నానా తంటాలు పడాల్సివస్తోంది. ఎక్కడికక్కడ కరెన్సీ కష్టాలు, నల్లధన సమస్యలు తలెత్తుతుండటంతో డిస్ట్రిబ్యూటర్లు చిత్రాలను కొనడానికి ముందుకు రావడం లేదని సమాచారం. డిస్రిబ్యూటర్ల వద్ద తగినంత వైట్ మనీ లేకపోవడంతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా పాతనోట్ల మార్పిడి కష్టంగా మారుతుందని, దాని వల్ల కేవలం ఓపెనింగ్స్‌పై ఆధారపడే స్టార్స్ చిత్రాలు ఓపెనింగ్స్ లేక ఇబ్బంది పడతాయని, ఇప్పటికే విడుదలైన కొన్ని చిత్రాలపై ఆ ఫలితం తీవ్రంగా ఉండటంతో చిత్రాన్ని కరెన్సీ కష్టాలు తీరి, నోట్ల చలామణి సులభతరం అయిన తర్వాత విడుదల చేయాలని భావించి 'ధృవ చిత్రాన్ని కాస్త వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారట.
ఇక ఆయన హీరోగా 'ధృవ' చిత్రం చేస్తూనే మరోపక్క తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఖైదీ నెంబర్150 ' చిత్రానికి నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. ప్రస్తుతం విదేశాల్లో ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. 'ధృవ' చిత్రం బాధ్యతలన్నీ అల్లు అరవింద్‌పైనే వదిలి చరణ్ మాత్రం ప్రస్తుతం తాను నిర్మిస్తున్న తండ్రి చిత్రానికి కూడా ఇవే కష్టాలు తప్పవేమో అని భయపడుతున్నాడట. ఇక ఓవైపు 'ధృవ'కి ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ, మరోవైపు నిర్మాతగా 'ఖైదీనెంబర్ 150' పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు, ఈ చిత్రం ప్రమోషన్, సరిగ్గా డిస్ట్రిబ్యూటర్లను హ్యాండిల్ చేసి నిర్మాతగా సక్సెస్ కావాలని చరణ్ రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడంటున్నారు. కాగా ఈ సంక్రాంతికి చిరు చిత్రంతో పాటు బాలయ్య,వెంకీ చిత్రాలు, దిల్‌రాజు-శర్వానంద్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'శతమానం భవతి' చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉండటంతో ఆయన మంచి థియేటర్ల కోసం ఇప్పటినుంచే వేట ప్రారంభించాడంటున్నారు. ఇక నిర్మాతగా తొలి చిత్రానికే ఆయన రోజువారి కూలీపై పనిచేసే యూనిట్ సభ్యులకు ఎక్కడి నుంచి వైట్ మనీని తేవాలి? ఈ చిత్రం ప్రమోషన్‌ను భారీగా, చాలా ముందుగానే ప్లాన్ చేయడంతో దానికి కూడా డబ్బును ఎలా సేకరించాలో తెలియక ఇబ్బందులు పడతున్నాడంటున్నారు. ఇక 'ధృవ' చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న చరణ్, దానికి తగ్గట్లుగా బాడీ ల్యాంగ్వేజ్, బాడీ బిల్డప్ కోసం రోజూ వ్యాయామాలు, ట్రైనర్ శిక్షణలో కుస్తీపడుతూనే, మరోపక్క తన సొంత చిత్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని తానే పరిశీలిస్తున్నాడని సమాచారం. ఇంతకీ ఇవ్వన్నీ మీదపడే సరికి చరణ్ కష్టపడుతున్నాడా? లేక టెన్షన్‌పడుతూ తిప్పలు పడుతున్నాడా? అనేది తెలియాలి. అయినా ముందుగా తాను నటించే చిత్రాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకొని తన కెరీర్‌ను చక్కబెట్టుకొని పవన్, మహేష్, బన్నీలకు పోటీగా ఎదగాల్సిందిపోయి ఇలా నిర్మాతగా కూడా తన తండ్రి చిత్రాన్ని భుజస్కంధాలపై వేసుకోవడాన్ని కొందరు తప్పుపడుతున్నారు.