రామ్ చరణ్ 'చిరుత' సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా చరణ్ కి పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. ఇక రెండో చిత్రానికే బంపర్ ఆఫర్ తగిలినట్లు ఏకంగా డైరెక్టర్ రాజమౌళి చేతిలో పడ్డాడు. ఇక మగధీర సినిమాతో రామ్ చరణ్ హీరోగా టాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు. అయితే తర్వాత చరణ్ చేసిన సినిమాలన్నీ కొన్ని ప్లాప్ లతో ఉంటే మరికొన్ని యావరేజ్ గా వున్నాయి. కానీ మళ్ళీ మగధీర వంటి హిట్ చరణ్ దరి చేరలేదు. ఇక అప్పటినుండి రామ్ చరణ్ హీరోగా నిలదొక్కుకోవడానికి చెయ్యని ప్రయత్నం లేదు. అటు సినిమాల్లో బిజిగా ఉంటూనే విమానయాన రంగంలోకి అడుగుపెట్టాడు. ఇక అప్పటినుండి వ్యాపార రంగం పై ఆసక్తి పెంచుకుని అటు సినిమాలు ఇటు వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు.
అయితే ఇప్పుడు చరణ్..తన తండ్రి సినిమాకి నిర్మాత అవతారం కూడా ఎత్తాడు. తన తల్లిని నిర్మాతగా చేసి ఆమెను తెరవెనుక కూర్చోబెట్టి అన్ని పనులను తాను చక్కబెట్టే బాధ్యతను నెత్తిన వేసుకున్నాడు. అందుకే తన ఇంటి పేరునే ప్రొడక్షన్ హౌస్ కి కూడా పెట్టేసాడు. అదే కొణిదెల ప్రొడక్షన్ హౌస్. తన మామ అల్లు అరవింద్ లాగా అనేక వ్యాపారాలు చెయ్యాలనుకుంటున్నట్టున్నాడు. అందుకే తన తండ్రి 150 సినిమాని నిర్మిస్తూ అన్ని బాధ్యతలు తనపై వేసుకుని చేస్తున్నాడు. ఇక ఆ నిర్మాణాన్ని ఒక్క 'ఖైదీ నెంబర్ 150' తోనే ఆపెయ్యకుండా మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నాడని...... అందుకే కొణిదెల ప్రొడక్షన్స్ హౌస్ ని స్టార్ట్ చేసాడని అంటున్నారు.
అలాగే సినిమా షూటింగ్స్ కి కావాల్సిన కొని వస్తువులు బయట తెచ్చి వాడుకుంటారు చాలామంది నిర్మాతలు. కానీ చరణ్ మాత్రం అవన్నీ సొంతంగా కొనేసి వాటిమీద కొణిదెల ప్రొడక్షన్స్ పేరు రాయించేస్తున్నాడట. అంటే ఇక నిర్మాణ రంగాన్ని వదలడనేగా దానర్ధం. అందులోనూ హీరోగా నటించడం కన్నా నిర్మించడంలోనే మజా ఉంటుందని తన స్నేహితుల దగ్గర చరణ్ అన్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక చరణ్ నటించిన 'ధృవ' చిత్రం త్వరలోనే ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది.
ఇక తన సినిమా 'ధృవ', చిరు 'ఖైదీ...' సినిమా విడుదల కాగానే మరికొన్ని సినిమాలను యువ హీరోలతో నిర్మించాలని రామ్ చరణ్ భావిస్తున్నాడట. అందులో భాగంగానే తన ఫ్రెండ్ అఖిల్ రెండో సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తాడని వార్తొకటి ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో తెగ హల్ చల్ చేస్తుంది. మరి అఖిల్ తో చరణ్ సినిమా ఉంటుందనేది అధికారికంగా ఎక్కడా ప్రకటన అయితే వెలువడలేదుగాని ఈ వార్త మాత్రం తెగ ప్రచారంలోకొచ్చింది. ఇది నిజమా లేక రూమరా అనేది మరికొన్ని రోజుల్లోగాని క్లారిటీ రాదు అని అంటున్నారు.