సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ వివాదరహితుడు. ఆయన అనవసరంగా ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడు. ఇక ఆయనకు ఉన్న అభిమానులకు లెక్కే లేదు. ఆయన్ను విమర్శిస్తే వారికి ఇక పుట్టగతులు కూడా లేకుండా చేయగల సత్తా ఆయన ఫ్యాన్స్‌కు ఉంది. అందుకే రజనీని ఎవ్వరూ విమర్శించేంత సాహసం చేయరు. కాగా గతంలో రజనీ నటించిన సినిమాలల్లో కమెడియన్‌గా నటించి అందరి అభిమానాన్ని చూరగొన్న వడివేలు.. రజనీపై అనవసర విమర్శలు చేశాడు. దాంతో రజనీ అభిమానులు వడివేలు చిత్రాలను బహిష్కరిస్తూ వస్తున్నారు. రజనీ కూడా తన చిత్రాలలో వడివేలుకు అవకాశం ఇవ్వడం మానివేసి, తన అభిమానుల నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటున్నాడు.
తాజాగా కోలీవుడ్ దర్శకుడు అమీర్ సుల్తాన్ రజనీపై ఘాటైన విమర్శలు చేశాడు. స్టార్ హీరో సూర్య సోదరుడు కార్తిని పరిచయం చేసింది ఈ దర్శకుడే. ఇంతకీ ఈయన రజనీని విమర్శించడానికి కారణం వింటే ఆశ్చర్యమేస్తుంది. ప్రధాని మోదీ నల్లదనాన్ని లేకుండా చేయాలనే సద్దుద్దేశ్యంతో చేసిన కరెన్సీ మార్పిడి ప్రక్రియే దీనికి కారణం. ఈ నిర్ణయాన్ని రజనీ స్వాగతించాడు. మోడీజీ.. కొత్త ఇండియా వచ్చిందంటూ ఆయన నిర్ణయంపై హర్షం ప్రకటిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌తో అమీర్ సుల్తాన్‌కు కోపం నషాలానికి అంటింది. దాంతో ఆయన రజనీని ఉద్దేశించి.. ముందు నీ విషయం చెప్పు.. నువ్వు సంపాదించేదంతా వైట్ మనీయేనా? 'కబాలి' సినిమాకు టిక్కెట్లను ఎక్కువ రేటుకు అమ్మిన డబ్బు వైటా? బ్లాకా? అంటూ నిలదీశాడు.
ఓ మంచి పని చేసినందుకు రజనీ.. మోదీని ప్రశంసించడం తప్పేలా అవుతుంది. ఇప్పటివరకు ఎవరు ఏమి చేసినా... ఇకపై మాత్రం అందరూ రెమ్యూనరేషన్ నుంచి సినిమా బడ్జెట్ వరకు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి రజనీ ఏమీ అతీతుడు కాదు. ఈ మోదీ నిర్ణయం తనపై కూడా ఆర్ధిక ప్రభావాన్ని చూపుతుందని తెలిసినప్పటికీ రజనీ దానికి మద్దతు పలకడం తప్పేలా అవుతుందని ఆయన అభిమానులు అమీర్‌పై మండిపడుతున్నారు. వడివేలుకు పట్టించిన గతినే ఈ దర్శకునికి కూడా పట్టిస్తామంటూ శపథం చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ మొత్తం ఇదే హాట్‌టాపిక్ నడుస్తుంది.