దేశంలోని సెన్సార్‌బోర్డ్‌లు, దానికి సభ్యులను ఎంపిక చేసే విధానం.. వారు చిత్రాలను సెన్సార్ చేయడంలో అనుసరించే విధానాల పట్ల సినీ విశ్లేషకుల్లో, సామాజిక బాథ్యత కలిగిన వారిలోనే గాక, చాలామంది దర్శకనిర్మాతల్లో కూడా తీవ్ర నిరసన ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్దితి. అన్ని బాషల్లోనూ ఇదే తంతు. పలుకుబడి ఉన్న నిర్మాతలు, దర్శకహీరోల చిత్రాలను ఒక విధంగా సెన్సార్ చేస్తారు. చాలా సీన్స్‌ను కట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఆయా దర్శకనిర్మాతలు సెన్సార్ వారికి ఇచ్చే గిఫ్ట్‌లు, ముడుపులకు ఆశపడి సర్టిఫికేట్‌లను ఇచ్చేస్తుంటారు. కానీ పెద్దగా పలుకుబడిలేని దర్శకనిర్మాతలు, సెన్సార్ వారికి భారీ ముడుపులు ఇచ్చే స్థోమత లేని వారిని మాత్రం చిన్న చిన్న సన్నివేశాలను కూడా కట్ చేయాలని ఆదేశిస్తూ, సినిమా విడుదల తేదీ దగ్గరపడినా నానా ఇబ్బందులు పెడుతుంటారు. చివరకు రివైజింగ్ కమిటీది కూడా అదే తీరు. దీంతో చాలా మంది దర్శకనిర్మాతలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొద్దికాలం కిందట విడుదలైన 'ఉడ్తా పంజాబ్'కు ఏకంగా 80కట్స్ చెప్పారు. ఇక ఇటీవల విడుదలైన 'యే దిల్ హై ముష్కిల్' చిత్రానికి కూడా వేధింపులు తప్పలేదు. కాగా ఆదిత్యచోప్రా దర్శకనిర్మాతగా రణవీర్‌సింగ్, వాణికపూర్‌లు జంటగా రూపొందిన 'బేఫికర్' చిత్రం ట్రైలర్, పోస్టర్లు.. ఇవన్నీ చూసిన వారికి అసలు ఈ చిత్రానికి అసలు సెన్సార్ వారు అనుమతిస్తారా? అనిపిస్తుంది. ఈ చిత్రంలో ఏకంగా 40 ముద్దుసీన్లు ఉన్నాయి. ఇది బాలీవుడ్ రికార్డ్. సినిమా నిండా హాట్ హాట్ సీన్స్, ముద్దులేనట. ఇక హీరోయిన్ వాణికపూర్‌తో పాటు హీరో రణవీర్‌సింగ్ కూడా సెమీన్యూడ్‌గా కనిపించే పలు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయట. కానీ ఈ చిత్రం మాత్రం ఎలాంటి కట్స్ లేకుండా బయటకు వచ్చి డిసెంబర్9న విడుదలకు సిద్దమవుతోంది. సెన్సార్‌బోర్డ్ ఈ చిత్రానికి కనీసం 'ఎ' సర్టిఫికేట్ కూడా ఇవ్వకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను ఇవ్వడం అందరినీ నివ్వెరపరుస్తోంది. ఇదేమని అడిగిన వారికి ఈ మద్య సెన్సార్ రూల్స్ మారాయంటూ సెన్సార్‌వారు పెడసరి సమాధానాలు చెబుతున్నారు. ఇది ఎంత అన్యాయం... అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.