సినీ ఫీల్డ్‌లో ద్వితీయ విఘ్నాలను పెద్ద సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. ఎంతో మంది విషయంలో ఇది నిజమైంది. కానీ అక్కినేని నటవారసుడు అఖిల్‌కు మాత్రం మొదటి చిత్రం 'అఖిల్' డిజాస్టర్ కావడంతో రెండో చిత్రం ప్రారంభమే విఘ్నంగా మారింది. తన ద్వితీయ చిత్రాన్ని తనకు అచ్చిరాని మాస్ చిత్రంగా కాకుండా ప్రేమకధా చిత్రంగా ఆయన చేస్తున్నాడు. 'మనం' దర్శకుడు విక్రమ్.కె.కుమార్ దర్శకత్వం వహిస్తుండగా తన తండ్రి నాగార్జుననే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ బేనర్‌లో తీయనున్నాడు. 'మనం'లో తెరపై తళుక్కున మెరిసిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే విక్రమ్.కె.కుమార్‌తో అఖిల్‌కు ఇది ద్వితీయ చిత్రం అవుతుంది. ఈసారి ద్వితీయ విఘ్నం అనేది ఇలా మారిందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ విఘ్నాలు కేవలం శుభకార్యాల వల్ల రావడమే విశేషం. సెప్టెంబర్‌లో విక్రమ్ కె.కుమార్ వివాహం జరిగింది. దాంతో స్క్రిప్ట్ వర్క్ లేటయింది. ప్రస్తుతం పక్కా స్క్రిప్ట్ రెడీగా ఉంది. కానీ అఖిల్ నిశ్చితార్దం డిసెంబర్9న ఆయన ప్రేయసి శ్రేయాభూపాల్‌తో జరగనుంది. దీంతో స్క్రిప్ట్ రెడీ అయినా చిత్రం మాత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ఈ చిత్రాన్ని తీరిగ్గా జనవరి నుండి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. కాగా సినిమా కూడా వచ్చే ఏడాది ద్వితీయార్దంలో విడుదల కానుందని సమాచారం. అంటే అఖిల్ మొదటి చిత్రానికి, రెండో చిత్రానికి రెండేళ్ల గ్యాప్ వచ్చిందన్న మాట...! మరి ఈ చిత్రమైనా అఖిల్‌కు తొలిహిట్‌ను అందిస్తుందో లేదో చూడాలి...!