అదృష్టవంతుడంటే యంగ్‌హీరో రాజ్‌తరుణ్‌ను ఉదాహరణగా చెప్పాలి. హీరో అవుతానని కూడా ఊహించని ఈయన నాగార్జునను కూడా మెప్పించి హీరోగా మారి తొలి మూడు చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టాడు. 'ఉయ్యాల...జంపాల, సినిమా చూపిస్త మావా, కుమారి 21ఎఫ్' చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ హీరో ఆ తర్వాత మంచు విష్ణుతో కలిసి నటించిన 'ఈడో రకం.. ఆడో రకం'; 'సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు' చిత్రాలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా కానీ ఈ యంగ్ హీరో దూకుడు తగ్గలేదు. వరుసగా ఒకే నిర్మాణసంస్థలో రెండు చిత్రాలు చేస్తున్నాడు. ఇలా ఓ అప్‌కమింగ్ హీరోను నమ్మి ఒక చిత్రం నిర్మాణంలో ఉండగానే రెండో చిత్రంలో కూడా ఒకే నిర్మాత అవకాశం ఇవ్వడం చాలా అరుదు. ఆ నిర్మాత దగ్గర ఆ హీరో ఎంతో నమ్మకం సంపాదించుకుంటే కానీ ఇది సాధ్యం కాదు. దాన్ని రాజ్‌తరుణ్ నిజం చేశాడు. ప్రస్తుతం ఆయన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'చిత్రంతో పాటు 'అంధగాడు' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలను నిర్మాత అనిల్‌సుంకర నిర్మిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ ఎలాంటి హడావుడి లేకుండా వేగంగా సాగుతోంది. ఇటీవల విడుదలైన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. కాగా ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక 'అంధగాడు' చిత్రానికి రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి వెలిగొండ శ్రీనివాస్ కథపై, దర్శకత్వ ప్రతిభపై ఎంతో నమ్మకం ఉంటే గానీ ఇది సాద్యం కాదు. మరి ఈ రెండు చిత్రాలు రాజ్‌తరుణ్‌కు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో వేచిచూడాలి.