భారత ప్రధాని నరేంద్ర మోదీ అంచలంచలుగా, చాలా ప్రణాళికా బద్ధంగా తాను తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచాన్నే ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మోడీ పెద్ద నోట్లను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకొని ఇటు జాతీయ మీడియానే కాకుండా ప్రపంచ మీడియాని కూడా ఆకర్షించాడు. దీంతో ప్రస్తుతం ప్రపంచం దృష్టి మోడీపై పడింది. మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఒక్కసారిగా విదేశీ మీడియా సంస్థలు కూడా ఈ విషయంపై వరుసబెట్టి కథనాల్ని ప్రచురిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్, బిబిసి, ది గార్డియన్, హఫింగ్టన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, డైలీ మెయిల్ వంటి మీడియా సంస్థలు కూడా మోడీ తీసుకున్న నిర్ణయంపై వరుసబెట్టి కథనాల్ని ప్రచురిస్తున్నాయి. కాగా ఈ మీడియా సంస్థలన్నీ కూడా మోదీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాన్ని సమర్థిస్తూ చర్చించుకుంటున్నప్పటికీ.. ఒకరకంగా మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయనకే పెద్ద ఎత్తున ఎదురు దెబ్బె తగిలిందనే చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది.
సంచలనం రేపేలా మోడీ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అయినప్పటికీ.. దీనిమూలంగా భారత్ ఒక్కసారిగా ఆర్థికంగా కుదేలైందని బిబిసి వివరించింది. ఇంకా పెద్ద నోట్ల రద్దు ప్రకటించడంతో భారత్ లో తలెత్తిన పలు సమస్యల కారణంగా సుమారు 25 మంది వరకు మరణించినట్లు హఫింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. చైనా ప్రభుత్వ రంగ మీడియా ది గ్లోబల్ టైమ్స్ మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదే కానీ.. ఈ విషయంలో తెలివిగా వ్యవహరించకపోతే.. ఇదో పెద్ద పొలిటికల్ జోక్ గా మారే అవకాశం లేకపోలేదని హెచ్చరించింది. ఇంకా ప్రపంచ మీడియా ఈ విషయంపై స్పందిస్తూ.. మోదీ నిర్ణయంతో సామాన్యుల జనజీవనం పూర్తిగా స్థంబించిందనీ, అంతేకాకుండా ప్రజలంతా బ్యాంకుల ముందు చాంతాడంత క్యూలో నిలబడాల్సి వస్తుందని తెలిపింది. దీంతో మోడి ఇమేజ్ కి నష్టం వాటిల్లుతుందా? లేకా లాభం చేకూరుతుందా? అనేది ఎవరికి వారు అర్థం చేసుకోవాలి.. లేదా ముందు ముందు పరిస్థితులను బట్టి తెలుసుకోవాల్సిందే.