జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద నోట్ల రద్దుపై స్పందించాడు. అయితే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా సాధన కోసం పెట్టిన అనంతపురం సభలో పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పవన్ సానుకూలంగా స్పందించాడు. ఆ సందర్భగా మోడీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లుగా మాట్లాడాడు. పెద్ద నోట్ల రద్దు చేశాక సామాన్యులు ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు క్యూ లైన్ లో పడిగాపులు కాస్తూ వేచి ఉంటున్న వారి బాధలకు అనుగుణంగా పవన్ స్పందించాడు.
అసలు ప్రస్తుతం భారత దేశంలో ఎంత మొత్తంలో కొత్త కరెన్సీ ఉందో కేంద్రం లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ విషయంలో మోడీ నిర్ణయం తీసుకొనే ముందు ప్రణాళికా బద్ధంగా వ్వవహరించలేదని, తగు జాగ్రత్తలు తీసుకోకుండా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుందంటూ పవన్ ఆరోపించాడు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థపైన, పట్టణాల్లోని మార్కెట్లపైన కేంద్రం దృష్టి సారించాలని ఆయన కోరాడు. ఇంకా పవన్ స్పందిస్తూ.. నోట్ల మార్పిడికి సమయంలో ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూస్తుంటే.. ప్రభుత్వం సరైన ప్రణాళికతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదని తెలుస్తుందన్నాడు పవన్. ఈ సందర్భంగా పవన్ తన మిత్రుడు రచయిత సాయి మాధవ్ ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు పడుతున్న కష్టాలపై రాసిన కవితని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.
కాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే వరుసబెట్టి బహిరంగ సభలు, ప్రజా సమస్యలపై ప్రజలతో చర్చలు జరుపుతున్నాడు. తాజాగా పవన్ ను ఆంధ్రప్రదేశ్ కు చెందిన జర్నలిస్టులు కలసినట్లు తెలుస్తుంది. అలా పవన్ వారి సమస్యలని స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. జర్నలిస్టులంతా కలిసి ఏపీ ప్రభుత్వం తమపై అలసత్వం ప్రదర్శిస్తోందని, ప్రభుత్వం కావాలనే తమ హెల్త్ స్కీమ్ లని ఆలస్యం చేస్తోందని చెప్పుకున్నట్లు వెల్లడౌతుంది. తమకు ఇచ్చిన హెల్త్ కార్డులు, మెడికల్ బిల్ లను రీయింబర్స్ మెంట్ చేసుకునే విధంగా లేవని వారు పవన్ కు చెప్పుకున్నారు. దీనిపై ప్రభుత్వం మనోభావాన్ని తెలుసుకున్న పవన్, సమస్యలను ప్రభుత్వం వాయిదా వేయడం మంచి పద్ధతి కాదని తెలిపినట్లు సమాచారం అందుతుంది. అయితే పవన్ ఇప్పుడు ఎన్నడూ లేనంత చురుకుగా వ్యవహరిస్తున్నాడు. నిర్మాతగా కొత్త సినిమా మొదలెట్టిన పవన్ వరసగా తన సినిమాల కోసం డేట్ లు కూడా ఇచ్చేశాడు. ఇంకా రాజకీయపరమైన పనులు కూడా ఒక్కొక్కటిగా చక్కబెట్టుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో ప్రస్తుతం సామాన్యుడు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులపై పవన్ తీవ్రంగా కలత చెందుతున్నట్లు సమాచారం.