పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని బేనర్‌లో రాధాకృష్ణ నిర్మాతగా వచ్చే ఏడాది జనవరి నుండి ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. పవన్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న 'కాటమరాయుడు' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉంటే త్రివిక్రమ్ మాత్రం పవన్ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. కాగా ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 'జల్సా, అత్తారింటికి దారేది' చిత్రాల తర్వాత ఈ చిత్రం పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కనుంది. కాగా 'జల్సా, అత్తారింటికి దారేది' చిత్రాల తరహాలోనే ఈ చిత్రంలో కూడా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. మొదట ఈ చిత్రానికి కూడా త్రివిక్రమ్ తన 'అ..ఆ' చిత్రానికి పనిచేసిన సమంత, అనుపమ పరమేశ్వరన్‌లనే హీరోయిన్లుగా తీసుకోవాలని భావించాడట. ఆ తర్వాత కొత్తవారికి ఇందులో చాన్స్ ఇవ్వాలని భావించాడు. కానీ చివరకు తెలుగు ప్రేక్షకులకు 'నేను..శైలజ' చిత్రంతో పరిచయమై, త్వరలో నానితో 'నేను.. లోకల్' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న కీర్తిసురేష్‌కు అవకాశం ఇచ్చాడు.
ఇక ఈ చిత్రంలో నటించనున్న రెండో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారో అన్న క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది. ఇప్పుడు దానికి కూడా సమాధానం దొరికినట్లేనంటున్నారు. ఇప్పటికే తెలుగులో వరుణ్‌తేజ్ సరసన 'ముకుంద', నాగచైతన్య సరసన 'ఒక లైలాకోసం' చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయిన పూజాహెగ్డే ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ హృతిక్‌రోషన్ సరసన 'మొహంజదారో' వంటి భారీచిత్రంలో చాన్స్ సంపాదించింది. కానీ ఈ చిత్రం కూడా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఆమె ఇప్పటికే మెగాహీరో అయిన వరుణ్‌తేజ్ సరసన 'ముకుందా'లో నటించింది. దాంతో ఈ భామకు అనూహ్యంగా మరో మెగాక్యాంపు స్టార్, స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ సరసన అవకాశం లభించింది. వరస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ తాను తాజాగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న క్రేజీ మూవీ 'డిజె' (దువ్వాడ జగన్నాధం) చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇలా అనుకోని అదృష్టం పూజాహెగ్డేను వరించింది. ఇప్పటికే ఒక మెగాహీరో సరసన నటిస్తే ఆ హీరోయిన్లకు మిగిలిన మెగాక్యాంపు హీరోలు కూడా అవకాశం ఇస్తారనే ప్రచారం బాగా ఉంది. వాస్తవానికి ఇప్పటికే ఐరన్‌లెగ్ ముద్ర పడిన పూజాహెగ్డేకు బన్నీ అవకాశం ఇచ్చాడంటే దానికి ఆమె ఆల్‌రెడీ మెగాహీరో వరుణ్‌తేజ్ సరసన 'ముకుందా' చిత్రంలో నటించి ఉండటమే కారణం అంటున్నారు. కాగా ఇటీవల బన్నీ హీరోయిన్ల విషయాలలో కాస్త ఉదారంగానే వ్యవహరిస్తున్నాడు. కేథరిన్ వంటి హీరోయిన్‌కు కూడా ఆయన 'సరైనోడు' చిత్రంలో కీలకమైన అవకాశం ఇచ్చి ఆమెను మరలా నిలబెట్టాడు. కాగా ఇప్పుడు పవన్‌కళ్యాణ్ కూడా హీరోయిన్ల విషయంలో మెగాక్యాంపు సెంటిమెంట్‌ను మరోసారి రుజువు చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంలో ఆయన సెకండ్‌హీరోయిన్‌గా పూజాహెగ్డేకు అవకాశం ఇచ్చినట్లు టాక్. 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రంలో మరో మెగాహీరోయిన్ కాజల్‌కు అవకాశం ఇచ్చిన ఆయన నీసన్ చిత్రంలో ఎ.యం.రత్నం నిర్మాతగా రూపొందనున్న 'వేదాళం' రీమేక్‌లో కూడా మరో మెగాహీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌కు చాన్స్ ఇవ్వనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి పవన్ కూడా ఇప్పుడు మెగాహీరోల క్యాంపు సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నాడంటున్నారు.