మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అంటే ఇప్పుడు ఇండియాలో తెలియని వారుండరు. ఈయన అప్పట్లో అక్రమ మైనింగ్ కేసులో జైలు జీవితం గడిపి 2015లో బెయిల్ పై విడుదలైన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే గాలి జనార్దన్ రెడ్డి పేరు మళ్ళీ ఈ మధ్య తెగ వినిపిస్తుంది. అదీ ఎందుకంటే...తాజాగా గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా అత్యంత భారీ స్థాయిలో జరిపాడు. బళ్ళారిలో జరిగిన కూతురు వివాహం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశాడు. అలా వార్తల్లో వ్యక్తిగా నిలిచి ప్రభుత్వ అధికారుల కంట్లో పడ్డాడు. గాలి వారి వివాహానికి సినీ, రాజకీయరంగం నుండి చాలా మంది ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. కాగా గాలి జనార్దన్ రెడ్డి కూతురు వివాహం కోసం సుమారు రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇంత భారీస్థాయిలో కూతురు పెళ్ళి కోసం ఖర్చు చేయడంతో అందరి దృష్టినీ ఆకర్షించినట్లయింది. గాలి జనార్దన్ రెడ్డి జైలు నుండి విడుదలై బయటకు వచ్చిన తర్వాత చానాళ్ళ పాటు పెద్దగా ఎక్కడా గాలి ఊసే ప్రజల్లో రాకుండా చాలా జాగ్రత్త పడిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా వివాహానికి అయిన ఖర్చు విషయం గురించి మీడియా గాలి జనార్దన్ రెడ్డిని అడిగినప్పుడు వెళ్లి సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోండి అంటూ సమాధానం చెప్పాడు. కాగా వివాహానికి గాలి జనార్దన్ రెడ్డి చేసిన ఖర్చుపై సామాజిక కార్యకర్త నరసింహ మూర్తి ఆదాయపన్ను జనరల్ కు ఫిర్యాదు చేశాడు. నోట్ల రద్దు, కొత్త నోట్ల కోసం సామాన్యుడు పడే పాట్లు ఇవన్నీ ఉన్న ఈ సమయంలో గాలి జనార్దన్ రెడ్డికి అంత డబ్బు ఎలా వచ్చింది అంటూ ఫిర్యాదు చేశాడు. ఇంకా సామాన్యులు చిల్లర కోసం తెగ కష్టాలు పడుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో గాలి జనార్దన్ రెడ్డి అంత పెద్ద మొత్తం ఎలా ఖర్చు చేశారో తెలుసుకోవాలని పిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును బట్టి ఐటీశాఖ సోమవారం ఒబులాపురం మైనింగ్ కంపెనీపై పెద్ద ఎత్తున దాడులు జరిపి వివారాలు సేకరించడం మొదలు పెట్టింది.