భారత ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత పలువురు ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను ప్రకటించారు. పెద్ద నోట్లపై మోడీ తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచనలం రేపింది. నోట్ల రద్దు అంశంపై ఏపీ నాయకులు కూడా వారి వారి శైలిలో స్పందించారు. అయితే వైకాపా పార్టీ తరఫున నాయకులు మాత్రం అధికార పార్టీకి ముందే తెలియడంతో అంతా సర్దేసుకున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కానీ వైకాపా అధినేత మాత్రం ఇంతవరకు తను అనుకుంటున్న అభిప్రాయాన్ని ఏమాత్రం వ్యక్తపరచక పోవడం ఆశ్చర్యమేస్తుందంటూ తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత జగన్ స్పందించడంగానీ, కనపడటం కానీ ఎక్కడా జరగక పోవడంతో అసలింతకి జగన్ ఏమయ్యాడు? అనే అనుమానం తెదేపా నాయకులను పట్టి పీడిస్తుంది. కానీ వైకాపా నేతలైన రోజా, బుగ్గా రాజేంద్రనాథ్ రెడ్డి వంటి నాయకులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఏకంగా చంద్రబాబుపై బాణం ఎక్కుపెడుతున్నారు. తెదేపా కూడా వైకాపా ఆరోపణలకు అంతే స్థాయిలో ధీటుగా సమాధానం చెప్తుంది.
ఇదిలా ఉండగా వైఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించి పోగేసుకున్న బ్లాక్ ని జగన్ ఏ విధంగా మార్చుకోవాలో తెలియక ఏకంగా అజ్ఞాతంలోకి వెళ్ళాడని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. అసలు పెద్ద నోట్ల రద్దు విషయంపై జగన్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదో తెలపాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశాడు. పెద్ద నోట్ల రద్దుపై ముందస్తు సమాచారంతో చంద్రబాబు తన హెరిటేజ్ ని అమ్మేశాడని వైకాపా నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా తెదేపా నేతలు గట్టిగానే స్పందిస్తున్నారు. వైకాపా నేతలకు చంద్రబాబుని విమర్శించే నైతిక హక్కు లేదంటున్నారు కూడాను. కాగా జగన్ పై పలు అంశాల్లో అవినీతి ఆరోపణలున్న సంగతి తెలిసిందే. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టేలా ఈరోజు జగన్ తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామాన్ని సందర్శించి అక్కడ బహిరంగ సభలో మాట్లాడనున్నాడు. ఈ సందర్భంగా జగన్ అక్కడి ప్రజలతో ముఖాముఖిలోనైనా పెద్ద నోట్ల రద్దు అంశంపై నోరు తెరుస్తాడమో చూడాలి.