తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు తరచుగా గవర్నర్ నరసింహన్ ను కలుస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. గవర్నర్ ను ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా అప్పుడప్పుడు కలిసి ప్రభుత్వ పాలన గురించి వివరిస్తుంటారు. ఇది సహజమే కానీ, కేసీఆర్ మాత్రం గ్యాప్ లేకుండా కలవడం వెనుక మతలబు ఏమిటాని రాజకీయ వర్గాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత, ఢిల్లీ వెళ్లివచ్చాక గవర్నర్ ను కలిశారు. పెద్ద నోట్ల వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు. ప్రధాని మోది సాక్షాత్తు ముఖ్యమంత్రినే పిలిపించారు. ఢిల్లీ వెళ్ళి అన్నీ వివరంగా చెప్పివచ్చారు. అయినప్పటికీ మీరు కూడా ఒక మాట చెప్పండి అంటూ గవర్నర్ ను కేసీఆర్ కోరడం గమనార్హం. గవర్నర్ నేరుగా కేంద్ర ప్రభుత్వానికి పాలనకు సంబంధించి నివేదికలు ఇచ్చిన దాఖలాలు లేవు. పైగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ కావడం వల్ల ఎవరిని నొప్పించకుండా ఉండాలి.