కోలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా బాగానే గుర్తింపు ఉన్న మాస్ హీరో విశాల్. ఆయన తాజాగా నటించిన 'కత్తిసందై' ( తెలుగులో 'ఒక్కడొచ్చాడు') చిత్రం ఈనెలలోనే విడుదల కావాల్సివుండగా, కరెన్సీ కష్టాల వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. అయితే 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' చిత్రం ఇచ్చిన భరోసా ఆయనలో నమ్మకం పెంచి ఉంటుందని, దాంతో ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. ఇక నిఖిల్ సినిమా నుంచి స్ఫూర్తిని పొందిన పలువురు నిర్మాతలు ఇప్పుడు ధైర్యంగా తాము వాయిదా వేసిన చిత్రాలను రిలీజ్ చేసుకుంటున్నారు. చివరికి విజయ్ ఆంటోని నటించిన 'భేతాళుడు' కూడా తమిళ, తెలుగు వెర్షన్‌లను డిసెంబర్ 2న విడుదల చేయాలని భావించి, దానికి ఒక రోజు ముందుగానే ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ ఎందుకనో ఈపాటి ధైర్యాన్ని తన సినిమా రిలీజ్ విషయంలో విశాల్ చేయలేకపోతున్నాడు. తాజాగా ఆయన చెన్నైలో తన చిత్రాన్ని డిసెంబర్2న విడుదల చేయనున్నారనే వార్తలను ఖండించాడు. తన చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి (పొంగల్) రేసులో దించుతున్నానని స్పష్టం చేశాడు. కానీ ఆయన చెప్పింది కేవలం ఈ చిత్రం తమిళ వెర్షన్ గురించి మాత్రమే. కానీ తెలుగులో కూడా ఆయన ఈ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయాలా? వద్దా? అనే సందిగ్దంలో పడిపోయాడు. ఈ సంక్రాంతి బరిలో టాలీవుడ్‌లో చిరంజీవి, బాలకృష్ణ, దిల్‌రాజు వంటి వారి చిత్రాలు రిలీజ్ కానున్నాయి. దాంతో ఆయన ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేసే పరిస్థితి లేదని, తెలుగు వెర్షన్‌ను ఇప్పుడే విడుదల చేయకుండా సంక్రాంతి హడావుడి ముగిసిన తర్వాతే రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నటిస్తున్న మిల్కీబ్యూటీ తమన్నాకు తమిళ, తెలుగు భాషల్లో ఉన్న క్రేజ్ తన చిత్రానికి ఉపయోగపడుతుందనే ఆశతో ఉన్నాడు.